హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఆదర్శంగా నిలవాలని హైదరాబాద్ అదనపు కలెక్టర్ ఈ వెంకటాచారి (రెవెన్యూ) అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో.. కులాంతర వివాహాలు చేసుకున్న 33 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులాంతర వివాహాలు చేసుకున్న వారు కష్టసుఖాలను జయించి ఆదర్శంగా నిలిచి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ (స్థానిక సంస్థలు), ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డీడీ పీ యాదయ్య, ఏఎస్‌డబ్ల్యూవో గట్టుమల్లు, శ్రీనివాస్ బాబు, అరవింద్ మూర్తి, శ్రీశైలం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.