calender_icon.png 31 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు వేట!

30-01-2025 12:54:36 AM

  • ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం

టెన్త్ విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తున్న అధికారులు

నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాం తి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడంపై ఇంటర్మీడి యట్ విద్యాశాఖ దృష్టిసారించింది. కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచడంపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఏటా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన స్థాయిల్లో అడ్మిషన్లు జరగడం లేదు. ఈ క్రమంలో అడ్మిషన్ల పెంపు కోసం ప్రభుత్వ స్కూళ్ల బాట పడుతోంది.

ఇప్పటి నుంచే పదో తరగతి విద్యార్థుల వివరాలను తెలుసుకొని వారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందేలా చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిం ది. ప్రతి జిల్లాకు ముగ్గురి చొప్పున అకాడమిక్ మానిటరింగ్ అధికారులను నియమిం చి బాధ్యతలను అప్పగించింది. ప్రణాళికలో భాగంగా జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను విభజించి, ఆ కాలేజీల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులను అధికారులు కలవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోని హెడ్‌మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి పదో తరగతి ఫలితాల తర్వాత ప్రభు త్వ కాలేజీల్లో చేర్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క పైసా ఫీజు లేకుండా ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నట్టు చెబుతున్నారు.

అలాగే పుస్తకాలు, మంచి అధ్యాపకులు, ల్యాబ్‌లు, ఇతర వసతులు ఉన్నాయని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థులకు వసతి కల్పించేందుకు వీలుగా సీట్ల సంఖ్యను పెంచేలా జిల్లాల కలెక్టర్లతో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈసారి 50 వేల అడ్మిషన్లు పెరిగేలా!

రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రతి విద్యాసంవత్సరం లక్షకుపైగా విద్యార్థులు చేరాల్సి ఉండగా... ఆస్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు. 2024 విద్యాసంవత్సరంలో 80 వేలకుపైగా అడ్మిషన్లు మాత్రమే జరిగాయి. దీనిపై దృష్టిసారించిన ఇంటర్ బోర్డు...మానిటరింగ్ అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేసింది. 2025 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో జరిగిన అడ్మిషన్ల కంటే 60 శాతం అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఇంటర్ బోర్డు పదో తరగతి పరీక్షలైన తర్వాత మే నెలలో జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. కానీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టేశాయి. పదో తరగతి విద్యార్థుల వివరాలను తెలుసుకొని మరీ వారి తల్లిదండ్రులకు సంప్రది స్తున్నాయి.

తమ కాలేజీల్లో ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని, గడువు దాటాక వస్తే సీటూ దొరకడం కూడా కష్టమేనన్న పరిస్థితులను సృష్టిస్తున్నాయి. దీంతో  వారి మాయమాటలను నమ్మి చేసేదిలేక తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ తరహాలోనే ఇంటర్ బోర్డు సైతం ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది.