01-03-2025 01:26:46 AM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : జిల్లాలో మార్చి 5 నుండి 25 వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,965 మంది జనరల్, 935 మంది ఒకేషనల్, ద్వితీయ సంవత్సరంలో 5,625 మంది జనరల్, 1,015 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, త్రాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.