calender_icon.png 25 February, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు చర్చలు జరపాలి..

24-02-2025 11:02:00 PM

పిలుపునిచ్చిన ప్రొఫెసర్ హరగోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొ.హరగోపాల్ కోరారు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ వార్షికోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహా సభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను పలువురు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జి. హరగోపాల్ మాట్లాడుతూ... మార్చి 1 నుండి 4వ తేదీ వరకు జరగనున్న ఈ మహా సభలకు 23 రాష్ట్రాల నుండి, మేధావులు, ప్రముఖ జాతీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.

సహజ వనరులు, ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు కాపాడే ధ్యేయంగా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక పోరాడుతుందన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ జాతీయ సమావేశంలో 30 ఏళ్ల పోరాటాలను, ఉద్యమ విజయాలను, ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను ఈ జాతీయ సభలో చర్చిస్తామని తెలిపారు. చేనేత వారసత్వం పేరిట హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడాన్ని పీఓడబ్ల్యూ సంధ్య తప్పుబట్టింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ, తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకులు విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, కిరణ్, మీరా సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.