calender_icon.png 24 December, 2024 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకీకృత చదువులు.. ఆధునిక బడులు

07-10-2024 02:27:19 AM

రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లకు శ్రీకారం

అన్ని సామాజిక వర్గాలకు ఒకే క్యాంపస్‌లో విద్య

అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలల నిర్మాణం

రూ.5 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

పైలెట్ తొలుత కొన్ని నియోజకవర్గాలకు పరిమితం

దసరాలోపే భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): శిథిలమైన అద్దె భవనాలు.. పైకప్పు నుంచి రాలిపడే పెచ్చులు.. విరిగిన కుర్చీలు.. అరకొర ఫర్నీచర్.. పరిశుభ్రంగా లేని మరుగుదొడ్లు.. ఉపాధ్యాయుల కొరత.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సమస్యలు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.

అలాగే ఎవరి సామాజిక వర్గానికి కేటాయించిన గురుకులాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులే చదువుతున్నారు. అలా కాకుండా ‘పిల్లలంతా అన్ని వసతులు ఉన్న శాశ్వత భవనాల్లో చదువుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలనే భేదాలు లేకుండా ఏకీకృత విద్యావిధానం అమలు కావాలి’ అనే సదుద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో నిర్మించేందుకు శ్రీకారం చుడుతోంది.

అందుకు ఏకంగా రూ.5 వేల కోట్లు వెచ్చించింది. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దసరాకు ముందే భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నది. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్యాంపస్‌లు నిర్మించనున్నది.

పైలెట్ ప్రాజెక్ట్ సత్ఫలితాలు ఇచ్చిన తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు లేదా అవసరాన్ని బట్టి మండల కేంద్రాల్లో గురుకులాలు నిర్మించనున్నది. ఏడు నెలల్లో భవనాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. వచ్చే విద్యా సంవత్సరంలోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను ప్రారంభించే దిశలో అడుగులు వేస్తున్నది.

అత్యాధునిక సౌకర్యాలు...

సర్కార్ ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూలును 20 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించన్నుది. ఒక్కో క్యాంపస్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూనే అధ్యాపకులు, సిబ్బంది సైతం అక్కడే నివాసం ఉండేలా భవనాలు నిర్మించనున్నది. తరగతి గదిలోకి వెలుతురు ప్రసరించేలా, విద్యార్థులు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా భవనాల నిర్మాణాలు ఉంటాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించేలా వాటి డిజైన్ ఉంటుంది.

ఏకీకృత వాతావరణం..

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులంతా ఏకీకృత వాతావరణంలో చదువుకుంటారు. వీరి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవనాలు అందుబాటులోకి వస్తాయి.

* ప్రతి క్యాంపస్‌లో 2,560 మంది విద్యార్థులు చదువుకోవచ్చు. వీరికి 120 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు. 

* క్యాంపస్‌లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, అతిపెద్ద లైబ్రెరీలు, ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయి.

* క్యాంపస్‌లో విద్యార్థులు క్రికెట్ మైదానం, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు అందుబాటులోకి వస్తాయి. వ్యాయామం చేసేందుకు వీలుగా అవుట్‌డోర్ జిమ్ ఏర్పాటవుతుంది.

* విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సదస్సుల నిర్వహణకు ఆడిటోరియం అందుబాటులోకి వస్తుంది.

* కమ్యూనిటీ, పాఠ్యేతర కార్యక్రమాల కోసం మల్టీపర్పస్ హాల్స్ ఉంటాయి.

* ఒకేసారి 900 మంది విద్యార్థులు కూర్చుని తినేందుకు వీలుగా డైనింగ్ హాల్ అందుబాటులోకి వస్తుంది. సిబ్బంది కోసం రిక్రియేషన్ క్లబ్‌లు, నివాసాలు క్యాంపస్‌లోనే ఉంటాయి.

తొలుత ఈ నియోజకవర్గాల్లో..

పైలెట్ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రభుత్వం కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, అందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి నియోజకవర్గాలను ఎంపిక చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఈ నెల 11న  భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నది. 

చాలా వరకు అద్దె భవనాలే..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,023 (రెసిడెన్షియల్) గురుకులాలు ఉన్నాయి. వీటిలో 662 గురుకులాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జనరల్ కేటగిరీలోని 35 గురుకులాలు   సర్కార్ భవనాల్లోనే నడుస్తున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 327 బీసీ గురుకులాలు ఉండగా, వీటిలో 306 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం 268 ఎస్సీ గురుకులాలకు గాను, 135 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

మొత్తం 185 ఎస్టీ గురుకులాలకు గాను, 42 పాఠశాలలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మొత్తం 205 మైనార్టీ గురుకులాలు ఉండగా, వీటిలో 179 పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అరకొర వసతులున్న అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో సుమారు 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇకపై శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మించి, విద్యార్థులకు అన్ని విధాలైన సౌకర్యాలు అందించేందుకు సర్కార్ అడుగులు వేస్తున్నది.

అందరికీ అన్నీ..

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు ఎవరి సామాజిక వర్గానికి కేటాయించిన గురుకులాల్లో వారు చదువుకుంటున్నారు. కానీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు ఒకేచోట విద్యనభ్యసించేలా విద్యావిధానం అమలవుతుంది.

అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అందరూ సమాన హక్కులు పొందే విధంగా ఆ విధానం ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరచుకునే విధంగా, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా ప్రత్యేకమైన ప్రణాళికలు అమలవుతాయి.