అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
పేద పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య
20 ఎకరాల్లో రూ. 25 కోట్లతో నిర్మాణం
ఈనెల 11న శంకుస్థాపనలు
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఈ ఏడాది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఆదివారం సచివాలయంలో భట్టి విక్రమార్క విడుదల చేశా రు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడి యా సమావేశంలో భట్టితోపాటు మం త్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో 20 నుంచి 25 ఎక రాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు రూ.25 కోట్ల నుంచి రూ.26 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర బోధిస్తారని తెలిపారు. మూడు నెలలుగా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లపై కసరత్తు చేశామని వివరించారు. 662 స్కూళ్లకు పక్కా భవనాలు లేవని, అన్ని అద్దె భవనాలేనని చెప్పారు.
7 నెలల్లో నిర్మాణం పూర్తి
ఈ ఏడాది రూ.5 వేల కోట్లను రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామని భట్టి తెలిపారు. కుల, మత, లింగ భేదం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలలో స్మాల్ ఆంపీ థియేటర్ కడతామని తెలిపారు.
ఈ నెల 11న సాధ్యమైనన్ని పాఠశాలలకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 24 నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని తెలిపారు. 7 నెలల్లో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నియామకం సొసైటీ ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు.
దసరా కంటే ముందే..
దసరా కంటే ముందే స్కూళ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆధునిక రెసిడెన్షియల్ స్కూళ్ల భవనాలు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
కేవలం చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి అందిస్తామని వివరించారు. థియేటర్ నిర్మించి శాటిలైట్ ద్వారా సినిమాలు సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. పేద వర్గాల వారు వారి పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
6 లక్షల మంది పిల్లల భవిష్యత్ కోసం: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దసరా సందర్భంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో బహుమతి అందిస్తుందరి మంత్రి కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్ కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
గత పది నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమమని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులు సౌకర్యాలలేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, 600 మంది విద్యార్థులు 20 రూముల్లో ఉంటున్నారని, 20 మందికి ఒక టాయిలెట్ కూడా లేని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామని స్పష్టంచేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే రూ.1100 కోట్లతో అమ్మ ఆదర్మ పాఠశాలల పథకాన్ని చేపట్టామని తెలిపారు. ఏ ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టామని, అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నామని స్పష్టంచేశారు.