టి.ఎస్.ఎస్.యు.ఎస్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ
కామారెడ్డి (విజయక్రాంతి): సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేటలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు టి.ఎస్.ఎస్.యు.ఎస్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ లో ఏకశిలా పార్కు నందు నిర్వహిస్తున్న ధర్నా శిబిరానికి హాజరై మా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో మీ యొక్క న్యాయమైన కోరికలు నెరవేర్చడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
కానీ ప్రభుత్వము వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి హామీని నెరవేర్చలేదు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన ఆమెను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిచో డిసెంబర్ మొదటి వారంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షులు వాసంతి, సంతోష్ రెడ్డి, రాజు, విజయ్, హేమలత, రెష్మ, బన్సీలాల్, సంఘాగౌడ్, కృష్ణవేణి మీనా, లలితా, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.