రూ.9కే ఫోన్‌పే పాలసీ
ముంబయి: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి బీమా కల్పించే ఉద్దేశంతో ఫోన్‌పే కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా బాణసంచా వల్ల గాయపడితే వారికి ఈ బీమా అండగా నిలుస్తుంది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే తెలిపింది. ఫోన్‌పే యూజర్‌తో పాటు భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి పాలసీ ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభం అవుతుంది.
దీపావళిని దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఫోన్‌పేలోని ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లి ‘ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్’ ఎంపిక చేసుకుని వివరాలు ఇచ్చి పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.