calender_icon.png 25 September, 2024 | 1:59 PM

రాళ్లకు బదులు మేం పెన్నులు ఇచ్చాం

20-09-2024 02:17:47 AM

ఉగ్రవాదం వీడి పుస్తకాలపై దృష్టి పెడుతున్నారు

జమ్ముకశ్మీర్‌లో 60 శాతం పోలింగ్ రికార్డు

3 పార్టీలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకున్నాయి

పాక్ అండగా నిలబడి దేశంలో విధ్వంసం సృష్టించింది

ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 19:  జమ్ముకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు కుటుంబాలు దోచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్‌లో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సంభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేస్తే జమ్ముకశ్మీర్‌లో మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది.

కాంగ్రెస్‌కు ఓటు పడితే ఆర్టికల్ 370 మళ్లీ అమల్లోకి వస్తుంది. దీంతో లోయలో మళ్లీ హింస మొదలవుతుంది. అప్పుడు పాకిస్థాన్ భల్లే భల్లే అంటూ ప్రజలతో, దేశంతో ఆటలాడుకుంటుంది. జమ్ముకశ్మీర్‌ను దోచుకోవడం జన్మ హక్కులా ఇన్ని రోజులు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి. యువత భవిష్యత్తును నాశనం చేశాయి. వాళ్లు కశ్మీర్ యువత చేతికి రాళ్లు విధ్వంసాలు సృష్టించేవి. బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్నులు ఇస్తోంది అని తెలిపారు.

పాఠశాలలను సైతం టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్నారంటే.. ప్రజలపై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పుడు కశ్మీర్ యువత చేతిలో రాళ్లు కాదు.. పుస్తకాలు, పెన్నులు కనిపిస్తున్నాయి. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. గత ఏడు ఎన్నికలను పరిశీలిస్తే ఇదే అత్యధికం. కశ్మీర్‌లో పండిత్ సంస్కృతి, వారసత్వం ఇమిడి ఉంది. కానీ, 3 పార్టీలు వారసత్వ రాజకీయాల కారణంగా కశ్మీరీ హిందువులను సొంతిళ్ల నుంచి వెళ్లగొట్టారు మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

కేంద్ర హోంమంత్రే భయపడేవారు

కశ్మీర్‌లో సిక్కు కుటుంబాల దురవస్థల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌ల మాదిరిగానే సిక్కులు హింసాకాండను ఎదుర్కొన్నారని మోదీ చెప్పారు. కశ్మీరీ హిందువులు, సిక్కులకు ఈ పరిస్థితి తలెత్తడానికి ఈ మూడు రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించారు. కొన్నేళ్లుగా ఈ సమాజాలు కశ్మీర్‌ను వదిలి వెళ్లేందుకు ఈ పార్టీలకు చెందిన అనుచరులే కారణమని మోదీ ధ్వజమెత్తారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ పరిణామం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ఈ ప్రాంతంలో ఒకప్పుడు మువ్వన్నెల జెండాను ఎగురవేయడాన్ని సైతం ప్రమాదకరంగా భావించేవారని, ఇప్పుడు ఇక్కడ తిరంగా రెపరెపలాడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేపై విమర్శలు గుప్పిస్తూ భయంతో లాల్‌చౌక్ వద్దకు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని షిండేనే స్వయంగా తెలిపారని మోదీ వెల్లడించారు. దీంతో భద్రతా సమస్యలతో లాల్‌చౌక్‌కు ప్రజలు కూడా ఈ ప్రాంతానికి వచ్చేందుకు భయపడే పరిస్థితి ఉండేదన్నారు. బీజేపీ వచ్చాక ఇదంతా మారిందని తెలిపారు.  

మాటలతూటాలు

జేకే ఎన్నికలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇంకా ఒడవలేదు. కాంగ్రెస్‌కు పాక్ రక్షణ మంత్రి మద్దతు పలకడాన్ని చూస్తుంటే పొరుగుదేశం కోరుతున్నట్లు ఆర్టికల్ 370, 35ఏ రద్దును కాంగ్రెస్ కోరుకుంటోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర ఆరోపించారు. పాక్ ఒక ఉగ్రదేశమని, ఆ దేశానికి సంబంధించి మంత్రి నేరుగా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావనపై బీజేపీ నేతలు స్పందిస్తూ జిన్నా అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తోందని మండిపడ్డారు. చైనాతో కాంగ్రెస్‌కు, పాక్‌తో గాంధీ కుటుంబానికి ఏం సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత మంజీందర్‌సింగ్ సిర్సా ప్రశ్నించారు.