calender_icon.png 20 October, 2024 | 5:10 AM

అడ్డుకునే బదులు విషమిచ్చి చంపండి

20-10-2024 02:52:57 AM

  1. మూసీ సుందరీకరణకు అడ్డుపడితే పోరాటం తప్పదు
  2. ఎంపీ ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదు
  3. విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

మూసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లా ప్రజల సమస్యలను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మూసీ సుందరీకరణను అడ్డుకొనే బదులు నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి.. దయచేసి మా బతుకులతో ఆడుకోకండి.. లేదంటే మీ ఇండ్ల వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తాం’ అని కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

నల్గొండ ప్రజల్ని నాయకులు రెచ్చగొడుతున్నారన్న  కేటీఆర్ మాటలు పూర్తిగా సత్యదూరమన్నారు. మూసీకి అడ్డుపడే ప్రతీ రాజకీయ పార్టీని నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించా రు. మూసీ కాలుష్యంతో ప్రజలు వివిధ అనారోగ్య సమస్యల తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ విషయంలో వెనకడుగేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మూసీ డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్డ్ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను నిర్మించిదని, ఎక్కడో పాకిస్థాన్‌లో కేసుయ్యిందని.. మూసీపై అవినీతి బురదజల్లడం దారుణమని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్‌ను రూపొందించిన వ్యాప్కోస్‌ను ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టాయన్నారు.

కేటీఆర్ బంధువులకు సంబంధించిన గ్లోబరిన్ సంస్థ పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించి నా వారికి బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుం బం రూ.5 వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు.