calender_icon.png 24 October, 2024 | 11:51 AM

బోడుప్పల్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

05-05-2024 12:48:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి) : గ్రేటర్‌లోని హబ్సీగూడ సర్కిల్ ఉప్పల్ సబ్‌డివిజన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఏడీఈ బాలకృష్ణ తెలిపారు. బోడుప్పల్ సబ్‌డివిజన్ బొడుప్పల్, ఉప్పల్, ఉప్పల్ భగాయత్, చిలకానగర్, రామాంతాపూర్ సెక్షన్లలో పగలు, రాత్రుళ్లు తరుచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ‘రాత్రి పది దాటితే పవర్ కట్ ’ అనే శీర్షికతో దిన పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఏడీఈ బాలకృష్ణ మాట్లాడుతూ ఓవర్ లోడ్ కారణంగానే విద్యుత్ అంతరాయం చోటు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఓవర్ లోడ్‌ను అధిగమించేందుకు బొడుప్పల్‌లో 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 160కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అవుతుందన్నారు. అంతే కాకుండా, ఉప్పల్ సబ్ డివిజన్ పరిధిలోని ఉప్పల్, బోడుప్పల్, ఉప్పల్ భగాయత్, చిలకానగర్, రామాంతాపూర్ సెక్షన్లలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.