వీధిలైట్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవా?
అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు
గత ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం తగదు
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ఆలనాపాలనా లేక ఆలూరు బైపాస్ రోడ్డు పనులు కొనసాగడం లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలూరు బైపాస్ రోడ్డు, అక్కడ నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను గురువారం ఉదయం జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్లతో, స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను ఆడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలూరు బైపాస్ రోడ్డు పొడవునా కరెంటు లైట్లు పెట్టడానికి కూడా ఆర్మూర్ మునిసిపాలిటీ లో డబ్బులు లేవా? అని నిలదీశారు.
అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు అని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మాణం స్థానిక ప్రజల తరతరాల కల అని ఆయన గుర్తు చేశారు. ఇరుకైన రోడ్డు, వాహనాల రద్దీ, దుమ్మూ ధూళి తో స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు కలుత్తుతున్నాయన్నారు, పక్కనే ఉన్న చెరువు నిండితే వచ్చే వరదలతో ఆర్మూర్ పట్టణంలోని వేల కుటుంబాలు నిరాశ్రయులు కావడం వంటివి ప్రతీ ఏటా జరిగి ప్రజల సమస్యలను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసిన పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా స్థానిక ప్రజలతో కలిసి ఆలూరు బైపాస్ రోడ్డు కోసం ఆందోళనలు చేపట్టామని జీవన్ రెడ్డి వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకాపూర్ పర్యటన సందర్భంగా తాను చేసిన బైపాస్ రోడ్డు ఆందోళనను గుర్తు చేసి దాని కోసం అక్కడికక్కడే రూ.13కోట్లు మంజూరు చేసి భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీచేశారని జీవన్ రెడ్డి వివరించారు. స్థానిక ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లోలెవల్ బ్రిడ్జ్ స్థానంలో హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు.
ఆలూరు బైపాస్ రోడ్డు వల్ల 50 గ్రామాలకు కనెక్టివిటీ కలిగిందని, ఇరుకు రోడ్డు పోయి విశాలమైన రోడ్డుతో ప్రజలకు సౌకర్యం కలిగింది అన్నారు. హైలెవల్ వంతెనతో నీటి ముప్పు తప్పిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది నుంచి ఆలూరు బైపాస్ రోడ్డును నిర్లక్ష్యం చేస్తోందని, ఆలనాపాలనా కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆలూరు బైపాస్ రోడ్డు పొడవునా కరెంటు లైట్లు కూడా పెట్టకపోవడం వల్ల స్థానిక ప్రజలతో పాటు వాకర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆర్మూర్ మునిసిపల్ చైర్మన్, కమిషనర్ లు ఇకనైనా ఆలూరు బైపాస్ రోడ్డుపై శ్రద్దపెట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నందిపేట్ డబుల్ రోడ్డు పొడవునా మొక్కలు నాటాలి
రూ.13 కోట్లతో నిర్మించిన నందిపేట్ డబుల్ రోడ్డు పొడవునా మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నందిపేట్ డబుల్ రోడ్డును గురువారం పరిశీలించిన జీవన్ రెడ్డి పలు సూచనలు చేయడమే కాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు, కట్టిన నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నందిపేట్ డబుల్ రోడ్డు డివైడర్ పొడవునా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటి వాటి సంరక్షణ పై శ్రద్దపెట్టాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.