19-02-2025 12:04:02 AM
లక్షేట్టిపేట, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిలర్లపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో రాష్ర్ట వ్యాప్తంగా విజిలెన్స్, కలెక్టర్ లు, రెవెన్యూ శాఖలు రంగంలోకి దిగి మిల్లుల్లో ముమ్మర తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ర్ట వ్యాప్తం గా 2022-23, 2023-24 వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసి మిల్లులకు కేటాయించగా మెజార్టి రైస్ మిల్లర్లు ధాన్యం మాయం చేశారు. తాజాగా మండలంలోని కొత్తూరు గ్రామంలోని జై యోగేశ్వర ఇండస్ట్రీస్ కూడా రూ. 9,06,85,020 ల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పక్కా ప్లాన్‌తోనే మోసం చేస్తున్న మిల్లర్లు..
చట్టాలలోని లొసుగులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ బియ్యం గడువులోగా ఇవ్వకపోగా పక్క ప్లాన్‌తోనే ప్రభుత్వాన్ని మిల్లర్లు ముం చుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హాయంలో బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ధాన్యం కేటాయించడంతో మిల్లర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
కొందరు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని రూపాయి పెట్టుబడి లేకుండా కూడా ప్రభుత్వాన్ని మోసం చేసిన సంఘటనలున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత విధానానికి స్వస్తి పలికి మంత్రివర్గం ఉప సంఘం నివేదిక కేబినెట్ ఆమోదంతో జీఓ 27ను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆర్ ఆర్ యాక్ట్ నోటీసులు జారీ అవుతున్నాయని తెలుసుకుని మిల్లర్లు తమ ఆస్తులను రికవరీకి ముందే అమ్మేసుకుని సొమ్ము చేసుకుం టున్నారు. వచ్చిన డబ్బును బినామీల పేరు మీద రియల్ ఎస్టేట్, ఇతర బిజినెస్ లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలుస్తోంది.
జై యోగేశ్వరా రైస్‌మిల్‌పై ఆర్‌ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసు..!
ప్రభుత్వ నిబంధనల మేరకు గడువులోపు సీ ఏం ఆర్ ఇవ్వని జై యోగీశ్వరా ఇండస్ట్రీస్ యజమాని గంప మధుపై సివిల్ సప్లు అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిం చారు. గతేడాది నవంబర్ 2న గంప మధుకు చెందిన స్థిర చరాస్తులను జప్తు చేయాలని స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ డిమాండ్ నోటీసు కూడా జారీ చేశారు.
%ఇఆ శ్రీం%. 35850/ 2024 ద్వారా మిల్లర్ పై క్రిమినల్, ఆర్ ఆర్ యాక్ట్‌ను అమలు చేశారు. అంతేకాకుండా ఈ నెల 12 న జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీకళ ఫిర్యాదుతో పోలీసులు జై యోగీశ్వరా ఇండస్ట్రీస్ రైస్ మిల్ ప్రోప్రైటర్ గంప మధుపై వరి ధాన్యం 513.357 మెట్రిక్ టన్స్, మొత్తం రూ.10,30,60,953 కోట్లు ప్రభుత్వానికి చెల్లించా లని చీటింగ్, ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
హైకోర్టు ఆదేశాల అమలేది..?
మిల్లర్ల ఆగడాలపై హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. డిఫాల్టర్ అయిన మిల్లర్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఇతర శాఖలకు ఆదేశాలిచ్చింది. కానీ కొందరు మిల్లర్లు ఆర్ ఆర్ యాక్ట్ నిబంధనలు తమకు ఇబ్బందిగా మారకముందే ఆస్తులను బినామీలకు మార్చడం లేదా ఇతరులకు అమ్మేయడం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నోటీసుల నుంచి కేసుల వరకు అధికారులు కూడా మిల్లర్లకు ఇతోధికంగా సహకరిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా హై కోర్ట్ కు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రభుత్వాన్ని ముంచిన మిల్లర్లు ప్రయత్నాలు చేయడం కొసమెరుపు.
‘మాములుగా’ తీసుకుంటున్న అధికారులు..
ధాన్యం మిల్లుల్లో దించుకుని అధికారులు తనిఖీలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం ధాన్యం నిల్వలు ఉన్నట్లు మిల్లర్లు బుకాయిస్తువచ్చారు. కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేయడంతో ఈ తతంగం బయటపడింది.
అధికారులను మభ్యపెడుతూ మిల్లర్లు రూ. కోట్లలో దోచి లక్షల్లో అధికారులకు మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల నుంచి రూ. 133 కోట్ల విలువైన ధాన్యం మాయమవుతున్న అధికారులు ఇన్నాళ్లుగా ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అధికారుల పనితీరు ఉందనే విమర్శలున్నాయి.