calender_icon.png 6 February, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే పోలీస్‌ స్టేషన్‌లో గురువు.. శిష్యురాలు

06-02-2025 12:22:36 PM

పరిగి,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన ప్రభావత్ లాల్యా నాయక్ తండ్రి నాలుగో తరగతిలోనే పరిగిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేరి చేర్పించాడు. అక్కడే చదువుకుంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఖమ్మంలోని పాల్వంచలో డిగ్రీ, ఎంఏ, బిఈడీ పూర్తి చేసి పరిగిలోని ఒక కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాడు. అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో అతను ఉద్యోగం కోల్పోయాడు. ముందుకు సాగాలని నిశ్చయించుకుని, పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలోని మక్త వెంకటపూర్ గ్రామానికి చెందిన జబీనా బేగం, ప్రభావత్ నాయక్ లెక్చరర్‌గా ఉన్న అదే ఇంటర్మీడియట్ కళాశాలలో చేరారు. ఆమె సామర్థ్యాన్ని గుర్తించి, ఆమె చదువులో చురుగ్గా ఉండటంతో, లాల్యా నాయక్  జబీనా చదువును ప్రోత్సహించాడు. ఆమె ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. అయితే జబీనా బేగం పరిస్థితి తెలుసుకున్న నాయక్ జోక్యం చేసుకుని, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం రద్దు చేయించాడు. ఆమె ఇంటర్ తో పాటు డిగ్రీ పూర్తి చేసేవరకు అండగా నిలిచాడు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా సహాయం చేశాడు. 2024లో, జబీనా సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఎంపికైంది. ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్ఐగా చేరారు. ఒకే పోలీస్ స్టేషన్ లో గురువు కానిస్టేబుల్ గా, శిష్యురాలు ఎస్ఐగా పని చేస్తున్నారు.