calender_icon.png 28 December, 2024 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్స్‌పియర్ కింగ్‌లియర్ నాటకం ప్రేరణతో..

28-12-2024 12:07:27 AM

కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుణసుందరి కథ’. ఈ చిత్రం 1949 డిసెంబర్ 28న విడుదలైంది. ఈ సినిమాలో గోవిందరాజు సుబ్బారావు, జూనియర్ శ్రీరంజని, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, రేలంగి తదితరులు నటించారు. షేక్స్‌పియర్ రచించిన ప్రముఖ ఆంగ్ల నాటకం ‘కింగ్ లియర్’ నాటకం ప్రేరణతో ఈ సినిమా నిర్మితమైంది.

శివపార్వతులు విహారం చేస్తూ వెళుతుండగా వారికి ఒక యువతి దేవునిప్రార్థిస్తూ ఏడుస్తూ ఉండటం.. ఆమె పక్కనే ఒక ఎలుగు కూర్చొని ఉండటం కనిపిస్తుంది. ఆమె కథేంటని శివుడిని పార్వతి అడగటంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ధారానగరాన్ని పాలించే రాజు ఉగ్రసేనుడికి హేమసుందరి, రూపసుందరి, గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు.

గుణసుందరికి జన్మనిస్తూ తల్లి మరణించడంతో ఉగ్రసేనుడు ముగ్గురు కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. యుక్త వయసు రాగానే వారిని సభకు తీసుకొచ్చి తన గురించి చెప్పమంటాడు. పెద్ద కుమార్తెలిద్దరూ తాము అందరికంటే ఎక్కువగా తండ్రినే ప్రేమిస్తామని.. గౌరవిస్తామని చెబుతారు. గుణసుందరి మాత్రం తనకు తండ్రిపై గౌరవాభిమానాలున్నాయని కానీ తను మాత్రం తన భర్తనే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెబుతుంది.

అంతే.. ఉగ్రసేనుడికి కోపం వచ్చి భర్త ఎలా ఉన్నా ప్రేమిస్తావా? అని అడుగుతాడు. అవునని గుణసుందరి చెప్పడంతో రాజ్యంలోని కుంటి, మూగ, చెవిటితో పాటు వికార రూపంలో ఉన్న వారందరినీ తెప్పించి వారిలో సకల అవలక్షణాలూ కలిగిన ఓ వృద్ధుడికిచ్చి గుణసుందరి వివాహాన్ని తండ్రి జరిపిస్తాడు. ఆ తరువాత కథ రసవత్తరమైన మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది.