calender_icon.png 19 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరిణితో ప్రేరణ!

31-10-2024 12:00:00 AM

పేరిణి.. తెలంగాణ ప్రాచీన సంప్రదాయ నృత్యకళ. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్లేముందు శివుడి ముందు ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు. అయితే కాకతీయుల కాలంలో విలసిల్లిన పేరిణి నృత్యాన్ని నాట్యాచారుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ వెలుగులోకి తెస్తే..

తెలంగాణ ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన నృత్యంతో విశ్వవ్యాప్తం చేస్తున్నాడు నాట్య కళాకారుడు గజ్జెల రంజిత్‌కుమార్. తనలాంటి కళాకారులతో కలిసి వేలాదిమందికి శిక్షణ ఇస్తూ ప్రేరణగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కళా ప్రయాణం గురించి వివరించారు ఇలా..

క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 1323 వరకు పాలించిన కాకతీయ రాజుల సేనలు యుద్ధాలకు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రేరణ కోసం నర్తించి పరమశివుని కటాక్షం కోసం  చేసే నృత్యమే పేరిణిగా సుప్రసిద్ధి. ఇది యోధుల నృత్యం.  కాకతీయుల సంప్రదాయం.

శరీరాన్ని యుద్ధానికి ఉత్తేజపరిచేందుకు లయబద్దంగా సాగే డప్పులమోతలే ఈ నృత్యానికి వాద్యాలు. రామప్పదేవాలయం, వేయిస్తంభాల గుడి, పాలంపేట ఆలయాల్లో పేరిణి నృత్య భంగిమల శిల్పాలు కాకతీయుల వైభవానికి చిహ్నాలుగా మిగిలాయి.

నా ది వరంగల్. నేను వెస్ట్రన్ డ్యాన్సర్‌ని.. కళలు అంటే చిన్నప్నట్నుంచే ఇష్టం. కూచిపూడిలో మంచి ప్రావీ ణ్యం ఉంది. ఎక్కడ ప్రదర్శనలు జరిగినా చురుగ్గా పాల్గొనేవాడ్ని. “నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు.. ఏదైనా ప్రత్యేక నృత్యం నేర్చుకో’ అని  పెద్దవాళ్లు సలహా ఇచ్చారు. దాంతో వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాలలో కూచిపూడితోపాటు భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను.

అయితే నా చిన్నతనంలో డాక్టర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణగారు పేరిణి కళ గురించి చాలా గొప్పగా చెప్పారు. “వరంగల్ కేంద్రంగా చేసుకొని కాకతీయుల పాలన సాగిందని. ఆ కాలంలో పేరిణి ఆదరించబడిందని” ఆయన చేసిన ఉపన్యానం నన్ను కదలించింది. ‘ఇది మన కల.. తెలంగాణ కళ’ అని తెలుసుకొని పేరిణి వైపు అడుగులు వేశా. అలా పేరిణితో నా ప్రస్థానం  మొదలైంది.

అయితే సమైక్యాంధ్రలో కూచిపూడి, భరతనాట్యం లాంటి కళలు ఎక్కువగా ప్రాధాన్యత పొందేవి. కానీ మన కళ పేరిణి మరుగునపడిపోయింది. పైగా జానపదంగా ముద్రవేశారు. ఇవన్నీ నాలో తీవ్ర వేదనను కలిగించాయి. పేరిణి వైపు అడుగులు వేయడానికి ఇదొక కారణం కూడా.

పాఠ్యాంశంగా పేరిణి

పరమశివుని కటాక్షంతో కదనరంగంలో దూకిన ప్రేరణ నృత్యరీతులే పేరిణి. అబ్బాయి అబ్బాయిలా ఉంటూ వీరత్వం ప్రదర్శించే కళ ఇది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని పేరిణి ద్వారా నావంతు ప్రదర్శనలిచ్చి రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలియజేశా. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత భారతీయ నృత్య కళలో పేరిణి ఆర్ట్ ఫామ్‌గా ఉండాలని నా కోరిక.

ఇందుకోసం 2014 ఆగస్టు 8న వెయ్యి స్తంభాల గుడి వద్ద ‘పేరిణికి నలభై వసంతాలు’ అనే కార్యక్రమం నిర్వహించా. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది కళాకారులు తరలివచ్చారు. పేరిణిని పాఠ్యాంశంగా చేర్చాలని, నృత్య కళాశాలలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుగా ప్రవేశపెట్టాలని ఆ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా.

ఫలితంగా అప్పటి ప్రభుత్వం ఎనిమిదవ తరగతిలో పేరిణిని పాఠ్యాంశంగా చేర్చింది. ఓ కళాకారుడిగా నేను సాధించిన మొదటి విజయం ఇదే. అయితే ప్రస్తుతం సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా.. డిప్లొమా కోర్సులు లేవు. ఎక్కడ తాత్సారం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ మేధావులు గుర్తించి ప్రోత్సహించాలి. 

ప్రముఖ కళగా..

సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ కళలు కనుమరుగయ్యాయి. కనీసం కళలను ప్రదర్శించలేని పరిస్థితి ఉండేది. అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత పేరిణిని మరింత ముందుకు తీసుకెళ్లా. “మన కట్టు.. మన బోనం.. మన ఆచారం.. మన పేరిణి” అంటూ తెలంగాణతో పాటు దేశ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేశా. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నాలాంటి కళాకారులను గుర్తించింది.

‘పేరిణి అభివృద్ధి’ పేరిట ఏం చేస్తే బాగుంటుంది? ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అనే విషయాలపై చర్చించింది. ఫలితంగా 256 మంది కళాకారులతో హైదరాబాద్ లలిత కళాతోరణంలో నృత్యం ప్రదర్శించాం. ఇది అప్పట్లో ఓ రికార్డు. అయితే కూచిపూడి, భరతనాట్యం లాంటి కళలు ఎలా గుర్తింపు పొందాయో.. మన కళ పేరిణి కూడా అలా గుర్తింపు పొందాలని నా లక్ష్యం. అప్పుడే  కొత్త వారికి అవకాశాలు వస్తాయి. పేరిణి కళాకారులకు గుర్తింపు ఉంటుంది. 

మహిళల సమస్యలపై..

పేరిణి అంటే అబ్బాయిలు చేసే నృత్యమే కాదు.. అమ్మాయిలు కూడా చేయొచ్చు. మహిళలకు ఈ కళను అందించాలనే ఉద్దేశంతో నా భార్య నవ్యజతో కలిసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను.  2017 సాత్విక పెన్నా అనే మహిళ నృత్యరూపకంతో ఆకట్టుకొని పేరిణిని మహిళలకు మరింత చేరువ చేసింది. గురువు నటరాజు ‘పేరిణి తాండవం‘ తీసుకువస్తే.. ఆయన శిష్యుడు కళాకృష్ణ ‘పేరిణి లాస్యం’ ప్రవేశపెట్టాడు.. ఆ తర్వాత నేను ‘ప్రేరణ నత్యరూపకం’ పేరుతో పేరిణి ప్రదర్శనలు ఇస్తున్నా. ఇది ఒక స్టోరీని బేస్ చేసుకొని ఉంటుంది. 

అయితే పేరిణి కాకతీయుల కాలంలో ఏవిధంగా ఆదరించబడింది? తాము ఎదుర్కొం టున్న సమస్యలను మహిళలు ఏవిధంగా తిప్పికొట్టాలి? ఆత్మవిశ్వాసంతో ఏవిధంగా పోరా డాలి? ఆపద సమయంలో మహిళలు ఎలా చాకచాక్యంగా ఉండాలో? తెలియజేస్తున్నా. ఇంటర్నేషనల్ పేరిణి ఆర్టిస్ట్ అసిసొయేషన్ అధ్యక్షుడిగా పేరిణి మరింత విశ్వవ్యాప్తం చేయడమే నా లక్ష్యం. 

 బాలు జాజాల మహిళలకు ఓ వేదిక

2003 నుంచి పేరిణి శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నా.. పేరిణి అనగానే అబ్బాయిలకు సంబంధించిన నృత్యం అనేది అపోహ ఉండేది. అయితే కాకతీయుల కాలంలో మగవారే ప్రదర్శిస్తూ వస్తున్నప్పటికీ ముగ్ద చంద్రిక అనే నరక్తి కూడా పేరిణి ప్రదర్శించి సైనికుల్లో శక్తిని నింపింది.

గురువు రంజిత్ కుమార్ దగ్గర పేరిణి నేర్చుకున్నా. తెలంగాణలో కూడా మహిళలకు ఓ వేదిక ఉండాలనే ఉద్దేశంతో పేరిణి నేర్చుకోవడమే కాకుండా ట్రైనర్‌గా శిక్షణ ఇస్తున్నా. పేరిణి యుద్ధ వీరులను సన్నద్ధం చేయడమే కాకుండా భాక్తిభావం ప్రదర్శించే కళ కూడా.  

- నవ్యజ, పేరిణి ట్రైనర్