calender_icon.png 27 October, 2024 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

02-09-2024 09:06:30 PM

కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  శ్రీలత

కరీంనగర్,(విజయక్రాంతి): మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గానీ, మరే విధమైన వేధింపుల వలన  ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీం లేదా ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులను సంప్రదించవచ్చని కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత ఒక ప్రకటకనలో తెలిపారు. కరీంనగర్, భగత్ నగర్ లోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ నందు సోమవారంనాడు షీటీం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ మరియు షీ టీమ్స్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ శ్రీలత మాట్లాడుతూ... కమిషనరేట్ వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లకు గురైనా, మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు గురైన వెంటనే నిర్భయంగా షీటీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని ఇన్స్పెక్టర్ శ్రీలత తెలిపారు. షీటీమ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ ద్వారా మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని, వాటిలో ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నేరుగా సంప్రదించలేని వారు 8712670759 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం  జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ గడిచిన ఆగస్టు నెలలో అందిన ఫిర్యాదులలో ఆరు (06) క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 21 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. వివిధ పాఠశాలలు, కళాశాలలో, పబ్లిక్ ప్రదేశాలలో 20కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 65 హాట్స్పాట్ లలో  నిఘావుంచగా 11మంది పోకిరిలను పట్టుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు ప్రవేశపెట్టిన T. SAFE AAP ని వినయోగించుకోవాలని మీ ప్రయాణం లో భరోసానిస్తుందని  తెలిపారు.