calender_icon.png 15 January, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లుల్లో తనిఖీలు

14-07-2024 12:50:40 AM

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ రైడ్స్

మిల్లర్స్ అసోసియేషన్ నేతల మిల్లులపై ఫోకస్ 

పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌పై ప్రత్యేక పరిశీలన  

కోటగిరి బాలాజీ రైస్‌మిల్లులో 80 క్వింటాళ్లు సీజ్ 

నిజామాబాద్, జూలై 13 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైసు మిల్లులపై సివిల్ సప్లు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వని రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. కోటగిరి, ఖానాపూర్, మాధవనగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని మిల్లులపై దాడులు నిర్వహించిన అధికారులు.. మిల్లుల్లో సీఎంఆర్ ఉన్నాయా? లేదా? అని ఆరాతీశారు. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారా? అని పరిశీలించారు.

2022 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కేటాయింపులు, సేకరణపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. ఆయా మిల్లులకు ఎంత ధాన్యం కేటాయించారు? మిల్లు యాజమాన్యం తిరిగి ఎంత ఇచ్చింది? అనే విషయాలపై ఆరాతీశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రైస్ మిల్లర్ల మిల్లులపైనే విజిలెన్స్ అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. జిల్లాలో 200కు పైగా మిల్లులు ఉండగా, గతంలో సీఎంఆర్ ఇవ్వని 32 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రధానంగా 2023 వానకాలం పంటకు సంబంధించి రైస్ మిల్లుల నుంచి 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. దీనితో మిల్లుల్లో ఎంతమేర ధాన్యం నిల్వ ఉండాలి? ఎంత మేర ఉంది? ఉన్న వివరాలు సేకరించారు.  

కోటగిరిలో 80 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్ 

కోటగిరిలో శనివారం బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు.. 80 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనమా నిర్వహించి కేసు నమోదు చేశారు.