కస్టమర్లకు స్పాట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను అరికట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నగరవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా నగరంలోని పలు పబ్బుల్లో వీకెండ్స్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం అర్థ్ధరాత్రి సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 బార్లు, పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు.. కస్టమర్లకు స్పాట్ డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. అయితే డ్రగ్ పరీక్షల్లో అన్ని పబ్బుల్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి, హైదరాబాద్, రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, కిషన్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.