అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ
సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గంటా కవితాదేవి
గద్వాల,(విజయక్రాంతి): విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను త్వరగా పరిష్కరింప చేస్తానని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గంటా కవితాదేవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గంటా కవితాదేవి సందర్శించారు. పాఠశాలలోని పరిస్థితులు బాగాలేవని తమ దృష్టికి రావడంతో పాఠశాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె అన్ని తరగతి గదులను, వంటశాలను, పరిసర ప్రాంతాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిశీలించారు. పాఠశాలలో పాముల భయం, తాగునీరు, పారిశుధ్యం, మరుగు దొడ్లు, తరగతి గదుల కొరత, కిటికీలకు మెష్ లు మరియు పడుకోవడానికి వసతులు లేవని, తెలుగు, హిందీ, పి.ఇ.టి ఉపాద్యాయులు ఎఎన్ఎం లేరని విద్యార్థులు తమ సమస్యలను న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలలో మౌలిక సదుపాయాల పరిస్థితులను బాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాల పరిసర ప్రాంతాల్లో పాములు మరియు ఇతర సమస్యలు ఎక్కువగా ఉండటంతో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, మరియు పాఠశాల వాతావరణం మెరుగుపరచడంలో అన్ని చర్యలూ చేపట్టాలని, త్వరలోనే పాఠశాలకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు. విద్యార్థులు భయపడకుండా ఉన్నతంగా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శేషన్న, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.