04-03-2025 12:05:42 AM
స్పెషల్ డ్రైవ్ చేపట్టిన వైద్యశాఖ
కాటారం (భూపాలపల్లి) మార్చి ౩ : గర్భిణీ మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ లపై తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆడ, మగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ సెంటర్ల అన్నింటిని తనిఖీలు నిర్వహించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.
కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశానుసారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందు గల అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లను స్పెషల్ డ్రైవ్ కమిటీ మెంబర్స్ ద్వారా కలెక్టర్ మార్గదర్శకాల మేరకు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఆర్ ఆర్ డయాగ్నస్టిక్స్, లక్ష్మి డయాగ్నస్టిక్స్, కిరణ్ హాస్పిటల్, యోధ హాస్పిటల్, ప్రధాన్ హాస్పిటల్ నందు స్కానింగ్ కేంద్రాలను పరిశీలించారు.
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన గర్భవతుల స్కానింగ్ వివరాలను ఫార్మ్ ఎఫ్ రికార్డులను, స్కానింగ్ మిషన్ వివరాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఉమెన్ తాసిల్దార్ శ్వేత, ఉమెన్ పోలీస్ ఆఫీసర్ శ్రీలత, సఖి కన్సల్టెంట్ గాయత్రి, డాటా ఎంట్రీ ఆపరేటర్ మహేష్ పాల్గొన్నారు.