05-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 4, (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియాలో అంబేద్కర్ సెంటర్ కే.కే పల్లి క్రాస్ రోడ్డు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను ఆర్ అండ్ బి, విద్యుత్, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. పట్టణంలో డబుల్ రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృషితో 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం అధికారులు సర్వే నిర్వహించారు. అయితే తొలుత 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించగా, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో 80 అడుగులకు తగ్గించాలని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, మరో 20 అడుగులు తగ్గిస్తే ఎలాంటి నష్టం ఉండదని ప్రజలు పేర్కొంటున్నారు.
60 అడుగులకు తగ్గిస్తే రోడ్డు విస్తరణ చేసి ప్రయోజనం లేకుండా పోతుందని, 80 అడుగుల వరకు అయితేనే బాగుంటుందనే అభిప్రాయం అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు, అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ నాగేందర్రావు, ఈ ఈ భీమ్లా, ఏఈ ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.