చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రసాదంలో పురుగుల అవశేషాలు ప్రత్యక్షమవడం ఆదివారం కలకలం రేగింది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ చెందిన ఒక భక్తుడు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ప్రసాదం స్వీకరిస్తుండగా పులిహోరలో పురుగుల అవశేషాలు బయటపడ్డాయి. పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇలా పురుగుల అవశేషాలు రావడం ఏమిటని భక్తుడు ప్రశ్నించారు. కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. స్వామి వారి పులిహోరలో పురుగులు ప్రత్యక్షమైన సంఘటన నేపథ్యంలో ఆలయ ఈవో బాలాజీని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని తెలిపాడు. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు.