- అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
- జూబ్లీహిల్స్ సొసైటీ వ్యవహారాలపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ కోఆప రేటివ్ హౌసింగ్ బిల్డిగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవహారాలపై విచారణాధికారి గడువు దాటిన తరువాత నివేదిక సమర్పించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని హైకోర్టు పేర్కొంది.
గత పాలకమండలి వ్యవహారాలపై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ న్యాయవాది కే రమేశ్ చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విచారణాధికారి సెప్టెంబరు 7న నివేదిక సమర్పించారన్నారు.
గత పాలక మండలి నుంచి రూ.17.17 కోట్లు, రూ.23.42 లక్షలు వసూలు చేయాలని సహకార సంఘ కమిషనర్‌కు సూచిస్తూ నివేదిక సమర్పించా రన్నారు. 2022 మార్చి 23న విచారణాధికారిని నియమించారని, విచారణ గడువును నవంబరు 19 వరకు పొడిగించారని తెలిపారు. ఆరు నెలలకు మించి గడువు ఇవ్వరాదని చెప్పారు.
వాదనలు విన్న న్యాయమూర్తి 2022 నవంబరు 18న విచారణ నివేదిక సమర్పించినట్టు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నప్పటికీ రికార్డుల్లోని నివేదికలో తేదీ లేకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. నవంబరు అనుకున్నప్పటికీ గరిష్ఠ గడువు 6 నెలలు దాటిందని, అందువల్ల ప్రాథమికంగా ఇది ఉల్లంఘనేనని, దీన్ని అనుమతించలేమంటూ, విచారణ అధికారి ఇచ్చిన నివేదికను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.