calender_icon.png 12 January, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీర్ల విచారణ

09-07-2024 12:56:45 AM

  1. జస్టిస్ ఘోష్ కమిటీ ముందుకు కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ఇంజినీర్లు 
  2. గుత్తేదార్ల ప్రతినిధులను విచారించిన కమిషన్

16వ తేదీలోపు అఫిడవిట్లు దాఖలుచేయాలని ఆదేశం 

గత ప్రభుత్వ పెద్దలకూ నోటీసులు!

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పంప్ హౌస్‌ల ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ప్రాజెక్టు మొదటి లింక్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల ఎగువన ఉన్న లక్ష్మి, సరస్వతి, అన్నారం పంప్‌హౌస్‌లకు చెందిన ఇంజినీర్లను విచారణకు పిలిచింది. చీఫ్ ఇంజినీర్ నుంచి ఏఈఈ క్యాడర్ వరకు విచారణ కొనసాగింది. 14 మంది ఇంజినీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు.

పంప్‌హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, పంప్‌హౌస్‌ల లెవెల్, పూర్తి నిల్వ సామర్థ్యం, నీటి ఎత్తిపోతల గురించి వివరాలు సేకరించింది. విచారణలో తెలిపిన వివరాలతో ఈ నెల ౧౬వ తేదీలోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను అదేశించింది. గతంలో పంప్‌హౌస్‌లు మునిగినప్పుడు తలెత్తిన పరిస్థితులు, కారణాలు, సాంకేతిక సమస్యలు ఇతర అంశాలపై కూడా కమిషన్ దృష్టి సారించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కమిషన్ ఇటీవల ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది.

తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఏజెన్సీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ చైైర్మన్‌తో ఘోష్ స్వయంగా మాట్లాడారని తెలుస్తోంది. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్‌కు సహాయంగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటివరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. 

గత ప్రభుత్వ పెద్దలకు సైతం 

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సాంకేతిక అంశాలు, ఆ తర్వాత ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారిస్తోంది. ఎన్డీఎస్‌ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగించనుంది. కమిషన్‌కు ఇచ్చిన గడువును మరో రెండు నెలలపాటు రాష్ర్ట ప్రభుత్వం పొడిగించింది.

ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్ నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌కు ఎవరు, ఏది చెప్పినా ప్రతీదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు పీసీ ఘోష్ ఇప్పటికే వెల్లడించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసినవారిపై చర్యలు ఉంటాయని గతంలోనే ప్రకటించారు. అఫిడవిట్లు అన్నీ పరిశీలించాక అవసరమైనవారిని విచారణకు పిలుస్తామని, లోపం ఎక్కడ జరిగింది? ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని జస్టిస్ పీసీ ఘోష్ పేర్కొన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయన్న అంశాలు రికార్డు రూపంలో వచ్చిన నేపథ్యంలో విచారణను వేగవంతం చేయనున్నారు.