calender_icon.png 10 October, 2024 | 9:51 AM

నిర్మాణ వ్యయాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్

04-10-2024 12:10:44 AM

అనుమతించిన సుప్రీం కోర్టు

వాణిజ్య రియల్టీ రంగానికి ఊరట

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి, వాణిజ్య సముదాయాలను లీజుకు తీసుకునేవారికి ప్రయోజనం కల్పించేలా జీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను (ఐటీసీ) సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈ రూలింగ్‌తో వాణిజ్య సముదాయాలకు అయ్యే నిర్మాణ వ్యయాలపై ఆయా కంపెనీలు చెల్లించే జీఎస్టీని వాటిని లీజుకు ఇచ్చేటపుడు ట్యాక్స్ క్రెడిట్‌ను పొందవచ్చు.

దీనితో వాణిజ్య సముదాయాల అద్దెలు తగ్గుతాయి. మరోవైపు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ పెరుగుతుంది. గురువారం సుప్రీం బెంచ్ ఇచ్చిన రూలింగ్‌తో  కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కే కాకుండా వాణిజ్య ఆస్తులను లీజుకు తీసుకునే వివిధ పరిశ్రమలకు కూడా ఐటీసీ ప్రయోజనం లభిస్తుంది. 

కేసు నేపథ్యం

స్థిర ఆస్తుల నిర్మాణం కోసం అందించే కాంట్రాక్ట్ సర్వీసులు, ఇతర వస్తు, సేవలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిం చేస్తూ సఫారి రీట్రీట్స్ ఒడిస్సా హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 17(5)(ఏ) కింద ఐటీసీని హైకోర్టు అనుమతించింది. తదుపరి దీనిపై రెవిన్యూ శాఖ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తూ స్థిరాస్తులపై ఐటీసీని క్లెయిం చేయడానికి జీఎస్టీ నిబంధనలు అంగీకరించవని పేర్కొంది.

ఈ క్రమంలో జీఎస్టీ నిబంధనల రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ పలువురు పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2023లోనే సుప్రీం కోర్టు ఈ విచారణను ముగించి ఉత్తర్వుల్ని రిజర్వ్ చేసింది. న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కరోల్‌తో కూడిన బెంచ్ తాజా రూలింగ్ ఇచ్చింది.