10-04-2025 12:18:54 AM
బీఆర్‌ఎస్ సభ విజయవంతం చేయాలని వినూత్న ప్రచారం
ఇచ్చోడ, ఏప్రిల్ 09 (విజయ క్రాంతి) : ఎవరైనా తమ ఇంట్లో పెళ్లి ఉంటే తమ బందువులకు, గ్రామస్తులకు పెండ్లి పత్రిక పంచుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటి పెళ్ళికి రావాలని ఆహ్వానిస్తారు. ఇదే తరహాలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టే సభ విజయవంతం కోసం జిల్లాలో ఆ పార్టీ నాయకులు వినూత్నంగా ప్రచారం చేపడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ లో ఈనెల 27వ తేదీన నిర్వహించే సభను విజయవంతం చేయాలంటూ మండలం లోని ముఖరా (కే) గ్రామంలో ఆ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ గాడ్గే సుభాష్, మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి దంపతులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలను కలిసి బొట్టు పెట్టి, సారె కింద చీరె, టవల్ అంధించి 25 ఏళ్ల గులాబీ పండుగ మన ఇంటి పార్టీ బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అందించారు. ముందుగా ఆహ్వాన పత్రాలకు ఆలయంలో పూజలు చేసి సభ విజయవంతం కావాలని భగవంతుణ్ణి వేడుకున్నారు.
ఈ సందర్భంగా గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ జోగు రామన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు రావాలని ఇంటిటికి వెళ్లి ప్రచారం చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం పాటుపడేది బీఆర్‌ఎస్ పార్టీ ఒకటేనన్నారు. కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతోందని, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, మళ్ళి తెలంగాణలో కేసీఆర్ పాలనే రావాలని ఆకాంక్షించారు.