వైద్య విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పిలుపు
కొత్తపల్లి (విజయక్రాంతి): నూతన ఆవిష్కరణలకు వైద్య విద్యార్థులు శ్రీకారం చుట్టాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి మెడికల్ కళాశాలలో జరిగిన వైట్ కోట్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వైద్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. వైద్యవృత్తిలో కొనసాగుతూనే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. వైద్యులు ధరించే తెల్ల కోటు సేవా గుణం, నిబద్ధతకు ప్రతీక అని, తెల్లటి కోటు కృషి, అంకితభావం, అభిరుచిని సూచిస్తుందన్నారు. వృత్తి నైపుణ్యం, నైతికత, రోగుల సంరక్షణ పట్ల నిబద్ధత సూచిస్తుందన్నారు.
తెల్లటి కోటు చూడడానికి సాదాసీదాగా కనపించినప్పటికీ అది కలిగి ఉన్న జ్ఞానం వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ తెల్లకోటు వేడుక వైద్య విద్యార్థుల జీవితాల్లో చిరస్మరణీయ ఘట్టమని పేర్కొన్నారు. తెల్లకోటు వేడుకలు జరుపుకోవడం వైద్య కళాశాలల్లోనే కాకుండా ఆరోగ్య సంబంధ రంగాల్లో ఆనవాయితీగా మారిందన్నారు. తెల్లకోటు వేడుకల సంప్రదాయాన్ని తొలుత 1993లో కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ అర్నాల్డ్ పి గోల్డ్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వైద్య విద్యార్థులు డాక్టర్లుగా రాణించాలని, రోగులకు అందించే సేవలతో వైద్య నారాయణులు అవ్వాలన్నారు.