29-04-2025 12:56:17 AM
సూర్యాపేట, ఏప్రిల్ 28: చత్తీస్ ఘడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట లలో యుద్ధాన్ని తలపిస్తుందని, బాంబుల మోతతో ఆ ప్రాంతంలో తల్లడిల్లుతుందని, అమాయక ఆదివాసీలు పోలీస్ బలగాల చేతిలో బలవుతున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వర రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆపరేషన్ కగార్ కి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు వామపక్ష పార్టీలతో కలిసి నల్ల జెండాలతో, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎల్ భద్రయ్య, టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాని కృష్ణారెడ్డి, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి లింగయ్య, ప్రజా ఫ్రంట్ నాయ కులు కోటయ్య, కరీం లు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..... కర్రెగుట్ట పై ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుండి ఇటు తెలంగాణ, అటు చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉన్నదనీ, ఆ ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీ తో చర్చలు జరిపే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ప్రాంత మంత్రి సీతక్క కూడా స్పందించి ములుగు, చర్ల ప్రాంతాల్లో ఉన్న బలగాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాలని కోరారు.