calender_icon.png 24 October, 2024 | 10:02 AM

భారత్‌కు అన్యాయం!

23-10-2024 12:00:00 AM

  1. కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి క్రికెట్, హాకీ తొలగింపు 
  2. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్ కూడా 
  3. గతంలో అత్యధిక పతకాలు ఈ క్రీడల్లోనే

లండన్: ప్రతిష్ఠాత్మక కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2026 కామన్‌వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్‌లోని గ్లాస్కో ఆతిథ్యమివ్వనుంది. 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్వాష్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ క్రీడాంశాలను తొలగిస్తూ కామన్‌వెల్త్ క్రీడల సమాఖ్య నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి 2026 కామన్‌వెల్త్ క్రీడలకు ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరం ఆతిథ్యమివ్వాల్సింది. ఖర్చులు పెరగ డంతో విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులు కుంది. దీంతో గేమ్స్‌ను నిర్వహించడానికి స్కాట్లాండ్ ముందుకొచ్చింది. అయితే ఖర్చు తగ్గించుకోవడం కోసం ఈసారి 10 ఈవెంట్లలోనే టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం భారత్‌కు ఎదురుదెబ్బ కానుంది.

ఎందుకంటే హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ నుంచే భారత్‌కు పతకాలు ఎక్కువగా వచ్చే చాన్స్ ఉంది. తాజాగా ఆ క్రీడలను తొలగించడంతో పతకాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. 2022 కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.

హాకీ నుంచి బ్యాడ్మింటన్ దాకా

ఒలింపిక్స్‌లో మన భారత అథ్లెట్ల ప్రదర్శన ఎలా ఉన్నా కామన్‌వెల్త్ గేమ్స్‌కు వచ్చేసరికి మాత్రం పతకాలతో అదరగొట్టారు. కామన్‌వెల్త్ క్రీడల్లో 564 పతకాలతో భారత్ ఓవరాల్‌గా నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఇందులో 203 స్వర్ణాలు, 90 రజతాలు, 171 కాంస్యాలున్నాయి. 2010లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వగా.. ఆ క్రీడల్లో 101 పతకాలు కొల్లగొట్టిన భారత్ రెండో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇక క్రీడల వారీగా చూస్తే షూటింగ్ నుంచి అత్యధికంగా 135 పతకాలు రాగా.. రెండో స్థానంలో రెజ్లింగ్ 114 పతకాలు (49 స్వర్ణాలు) ఉంది. 133 పతకాలతో (46 స్వర్ణాలు) వెయిట్ లిఫ్టింగ్ మూడో స్థానంలో ఉంది. ఇక బ్యాడ్మింటన్‌లో మన షట్లర్లు 31 పతకాలు కొల్లగొట్టారు.

హాకీలో పురుషుల జట్టు ఐదు పతకాలు, మహిళల జట్టు మూడు పతకాలు సాధించారు. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాకా భారత అమ్మాయిల జట్టు రజతంతో మెరిసింది. మనకు కచ్చితంగా పతకాలు వచ్చే క్రీడలను తొలగించడంతో ఈసారి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లోనే భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. 

2022 కామన్‌వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల జట్టు

ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన పోటీలుగా కామన్‌వెల్త్ క్రీడలకు పేరుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో ఖర్చు తగ్గించుకోవడం కోసం హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్, రెజ్లింగ్ తదితర క్రీడలను తొలగించారు. పైన పేర్కొన్న ప్రతీ ఈవెంట్‌లోనూ మన అథ్లెట్లు దేశానికి అధిక సంఖ్యలో పతకాలు తీసుకొచ్చారు. తాజాగా వీటిని తొలగించడంతో భారత్‌కు అన్యాయం జరిగినట్లే..!