calender_icon.png 26 December, 2024 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాష్ట్రంలో అమరులకు అన్యాయం

01-08-2024 12:00:00 AM

ప్రత్యేక తెలంగాణ కోసం 1969, ఆ తరువాత 2000 దశకంలో జరిగిన ఉద్యమాల్లో ఎంతో మంది ఆత్మ బలిదానాలు జరిగాయి. ఎందరో ప్రాణాలను వదిలారు. ఎవరి త్యాగం వృథా కాలేదు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు స్వయం పాలనలో కొనసాగుతున్నది. కానీ, అమరుల కుటుంబాల వేదనలు ఎప్పటికి పచ్చి పుండుగానే సలుపుతున్నాయి. వారి జీవితం ముగింపు లేని కన్నీటి గేయం.. అమరుల కుటుంబాలను ఆదుకోవల్సిన ప్రభుత్వాలు వారి త్యాగాలను మరిచాయి. ఇచ్చిన హామీలను మరిచాయి. కనీసం వారి మరణానికి తగిన గౌవరం కూడా దక్కిన దాఖలాలు లేవు. తన ఆయుష్సును త్యాగాల జెండాకు కట్టిన పోరు బిడ్డ కొండేటి వేణుగోపాల్‌రెడ్డిది అదే కథ.

రాష్ట్రమొస్తే గోస తీరుతది..

సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్ మండలం దోసపహడ్‌కు చెందిన కొండేటి కోటిరెడ్డి, లక్ష్మమ్మల రెండో సంతానం వేణుగోపాల్‌రెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. చదువుల్లో ముందుడే వేణుగోపాల్‌రెడ్డి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ 2010లో  హైద్రాబాద్‌లోని నాచారంలో ఉంటూ ఘట్‌కేసర్‌లోని లలిత కళాశాలలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సూర్యాపేట ఉద్యమ వాతావరణంలో పెరిగిన వేణుగోపాల్‌రెడ్డి అప్పటికే ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తే  తమ కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులతో చెప్పేవాడు. 2010 జనవరి 19న తన స్నేహితులతో కలిసి వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అక్కడ జరుగతున్న నిరసనలో పాల్గొన్న ఆయన తిరిగి ఇంటికి చేరలేదు. మరుసరి రోజు ఉదయం పూర్తిగా కాలిన శవమై క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం ప్రాంతంలో తెలంగాణ ప్రజలకు దర్శనమిచ్చాడు. అప్పటికి వేణుగోపాల్‌రెడ్డి  వయస్సు 23 ఏండ్లు. వేణుగోపాల్‌రెడ్డి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఒక్క సారిగా వేడెక్కింది. 

స్వరాష్ట్రం వచ్చాక పట్టించుకోలే.. 

వేణుగోపాల్‌రెడ్డి లాంటి ఎందరో బిడ్డల త్యాగాలతో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడింది.ఉద్యమంలో అసువులు బాసిన వేణుగోపాల్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్రం ఏర్పాటు తరువాత రూ.10 లక్షలు, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. కానీ, ఇస్తామన్న స్థలం కేటాయించలేదు. ఇల్లు ఇవ్వలేదు. హెల్త్ కార్డు మాటే మర్చిపోయారు. కుటుంబానికి పింఛన్ ఇస్తామని మాట ఇచ్చిన నాటి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆ ఊసే ఎత్తలేదు. కాలం గడుస్తున్న కొద్ది అమరుల కుటుంబాలకు ప్రాధాన్యత తగ్గింది. గత ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా అమరుల ఆశయాలకు అనుగుణంగా నడ్చుకోవాలని, అమరుల కుటుంబాలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపర్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. 

  తాందారపల్లి శ్రీనివాసులు, సూర్యాపేట, విజయక్రాంతి

నా కొడుకును మర్చిపోయిండ్రు

23 ఏండ్ల వయస్సులో రాష్ట్రం కోసం ప్రాణాలొదిలిన నా కొడుకు త్యాగాన్ని ప్రభుత్వాలు మరిచిపోయాయి. నా కొడుకు ఆత్మ బలిదానానికి న్యాయం జరుగడం లేదు. ఎందరో కొడుకుల బలీదానాలతో తెలంగాణ ఏర్పడింది. నేడు రాజకీయ నాయకులు బాగుపడ్డారు. మాకు  ఇల్లు, భూమి, పింఛను, హెల్త్‌కార్డు ఇస్తామన్నారు. నేటికి ఇవ్వలేదు. ప్రభుత్వం అమరులను గుర్తించుకోవాలి. 

 లక్ష్మమ్మ, వేణుగోపాల్‌రెడ్డి తల్లి