calender_icon.png 12 January, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 29తో బీసీలకు అన్యాయం

22-10-2024 02:08:54 AM

  1. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలి
  2. గవర్నర్‌ను కోరిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి): జీవో 29తో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, చెరుకు సుధాకర్, పల్లె రవి నేతృత్వంలోని బీసీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.

జోవో 29ను రద్దుతో పలు డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట  మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జోవో 29 అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్, జీవో 29 ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతోందని, అగ్రవర్ణాలకు పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందని గవర్నర్‌కు వివరించారు.

అగ్రవర్ణాలు 8శాతం ఉంటే వారికి 10శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రిక్రూట్‌మెంట్ విధానంలో మొత్తం అగ్రవర్ణాలే ఎంపికయ్యే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్‌లో అగ్రవర్ణాల వారే ఐఏఎస్‌లు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రకులాలకు అందలం ఎక్కించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇదే జరిగితే కేసీఆర్‌కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

భేషజాలకు పోకుండా గ్రూప్ పరీక్షను రద్దు చేయాలని కోరారు. అన్యాయం జరుగుతోందని రోడ్లుపైకి వచ్చిన విద్యార్థులను కొడతారా అని ప్రశ్నించారు. గతంలో 55 జీవో స్థానంలో 29 జీవోను తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాదిరిగానే బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిం చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో  కుందారం గణేశ్, బాలగోని బాలరాజు గౌడ్, బత్తిని సిద్ధేశ్వర, సంగం సూర్యారావు, చామకూర రాజు, బత్తిని లత, బంగారు నరసింహ సాగర్, కేవి గౌడ్, ఎర్ర మాదా వెంకన్న తదితరులు ఉన్నారు.