ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, రాష్ట్ర విద్యార్థి జేఏసీ నేతలో కలిసి బీసీ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్కు వద్ద మహాసభ నిర్వహిస్తున్నామని, ప్రజాస్వామిక వాదులంతా సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. మహాసభకు ఎన్నో ప్రజాసంఘాల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
కామారెడ్డి డిక్లరేషన్‌తో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీల హక్కులు, రిజన్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేశ్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్ సాగర్, రాచమళ్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వా చారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ పాల్గొన్నారు.