calender_icon.png 12 October, 2024 | 7:55 PM

టీచర్ పోస్టుల్లో మాదిగలకు అన్యాయం

10-10-2024 12:00:00 AM

ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం మాలలకు దోచిపెట్టే కుట్రే 

ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయం నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ 

అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

ముషీరాబాద్, అక్టోబర్ 9: సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు చేస్తున్నది ముమ్మాటికీ ద్రోహమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం మాలలకు ఉద్యోగాలన్నీ దోచిపెట్టే కుట్రేనని ఆరోపించారు.

ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం రేవంత్‌రెడ్డికి లేదని ఆయన మండిపడ్డారు. ఉపా ధ్యాయ నియామకాల్లో మాదిగకు అన్యా యం చేశారంటూ బుధవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాల యం నుంచి ఇందిరాపార్క్ వరకు మాదిగల నిరసన ర్యాలీ తలపెట్టారు. కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలలు వేయడానికి ర్యాలీగా వెళ్తున్న మందకృష్ణ మాదిగను, ఎమ్మార్పీఎస్ నాయకులను, కార్యకర్తలను ఇందిపార్క్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఒక బృందాన్ని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు, మరో బృందాన్ని బండ్లగూడ స్టేషన్‌కు తరలించారు.

దీంతో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కొద్దిసేపు పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే 11 వేల టీచర్ పోస్టులలో 1250 పోస్టులు మాదిగ నిరుద్యోగులకు లభించేవని, వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం వల్ల కనీసం 400 పోస్టులు కూడా లభించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతటి అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తాడని ఊహించలేదన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, అందుకోసం అవసరం అయితే ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పారు కదా.. మరెందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాలలకు కొమ్ముకాసేది అని మరోసారి రుజువు చేసుకుందని అన్నారు.

త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, టీవీ నర్సింహ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, సాంసంగ్ రాజ్ మాదిగ, సురవరం సుజాత మాదిగ, గజ్జల రాజశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.