calender_icon.png 10 October, 2024 | 4:58 AM

స్వర్ణ తాపడం పనులకు శ్రీకారం

10-10-2024 12:45:15 AM

బ్రహ్మోత్సవాల నాటికి యాదాద్రి విమాన గోపుర పనులు పూర్తయ్యేలా చర్యలు

స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి వినియోగానికి ప్రభుత్వ అనుమతులు

రాగి రేకులకు శాస్త్రోక్తంగా పూజలు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గర్భాలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనుల ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విమాన గోపుర బంగారు తాపడానికి తక్కు వ పడుతున్న బంగారం, నిధులను ఆలయానికి భక్తులు సమర్పించిన ముడి బంగారం, వెండి, ఆలయ నిధులను వినియోగించడానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలోనే బుధవారం విమాన గోపుర నిర్మాణం కోసం ఇప్పటికే సిద్ధం చేసి గోపురానికి అమర్చి సైజులను సరిచూసి పెట్టిన రాగి రేకులకు ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పూజలు చేసిన రాగి రేకులను బంగారు తాపడం నగిషీ పనులను చేపట్టడంలో నైపుణ్యత గల చెన్నై స్మార్ట్ క్రియేషన్స్‌కు ప్రత్యేక వాహనంలో తరలించారు.

తాపడం పనులకు 60 కిలోల బంగారం అవసరమని తయారీ ఏజెన్సీ అంచనాలు వేసింది. అయితే, ప్రస్తుతం ఈ విమాన గోపురానికి 10 కిలోల 500 గ్రాముల బంగారాన్ని, రూ.20 కోట్ల నగదును భక్తులు కానుకలుగా సమర్పించారు. భక్తులు అందించిన నగదు ద్వారా రూ. 26 కిలోల బంగారం కొనుగోలు చేస్తున్నారు.

అయినా, బంగారు తాపడం పనులకు తక్కువ పడుతుండటంతో దేవస్థానం వద్ద గల 13 కిలోల గోల్డ్ బాండ్స్‌ను వినియోగించనున్నారు. అదే విధంగా 2 కిలోల బంగారం, 776 కిలోల వెండికి సమానమైన మేలిమి బంగారాన్ని వినియోగించనున్నారు.

ఈ పనులు చేపడుతున్న స్మార్ట్ క్రియేషన్స్‌కు చదరపు అడుగుకు రూ.3,900 చొప్పున ఛార్జీలను చెల్లించేందుకు ఆలయ నిధులను వినియోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. స్వామివారి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 2025 నుంచి ప్రారంభమవుతున్నందున ఫిబ్రవరిలోనే బంగారు తాపడం పనులను పూరి చేయాలని నిర్ణయించారు.

కాగా, పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.