కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురయి దాదాపు 20 రోజులవుతున్నా దారుణంపై నిరసన జ్వాలలు మాత్రం చల్లారలేదు. నిందితుడిని ఉరి తీయాలంటూ రాష్ట్రంలో వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఆందోళనలను విరమించుకున్నప్పటికీ కోల్‌కతా నగరం మాత్రం మండుతూనే ఉంది. కాగా దాదాపు 20 రోజుల తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై తొలిసారి స్పందించారు.ఈ వార్త తెలియగానే ఎంతో ఆందోళన, ఆవేదన చెందానని ఒక వార్తాసంస్థకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఏ నాగరిక సమాజమూ ఇంత దారుణమైన హింసను ఉపేక్షించదని తేల్చిచెప్పారు. ఇక్కడితో ఇలాంటి అమానుషాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా నేరస్థులు మాత్రం ఎక్కడో ఒక చోట స్వేచ్ఛగా విహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఇలాంటి ఘటనలపై ప్రజలు స్పందిస్తున్న తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
12 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను ప్రస్తావిస్తూ, అప్పుడు ఉవ్వెత్తున ఎగసి పడిన ఆగ్రహజ్వాలలు ఆ తర్వాత చల్లారి పోయాయని, అప్పుడే గనుక సరైన రీతిలో స్పందించి ఉంటే సమాజంలో ఇలాంటి ఘటనలు కాస్తయినా తగ్గేవని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన అనేక అత్యాచారాలను ప్రజలు ఆ వెంటనే మరిచిపోయారన్నారు.
ఇలాంటి ‘సామూహిక మతిమరుపు’ అసహ్యకరమైందన్నారు. గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోందని అభిప్రాయపడిన ముర్ము ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చే సమయం ఆసన్నమైందన్నారు. సమాజం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు.రాష్ట్రపతి ఒక ఘటనపై ఇంత తీవ్రస్థాయిలో స్పందించడం అత్యంత అరుదు. రాష్ట్రపతి పిలుపు తర్వాతనైనా బాధ్యత కల సభ్య సమాజం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు ఇకపై జరక్కుండా చర్యలు తీసుకునేందుకు నడుం బిగిస్తాయన్న ఆశలు కలుగుతున్నాయి.
నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం ఈ ఘటనను నీరుగార్చడానికి ప్రయత్నిస్తే కేంద్రం రాష్ట్రాలకు ఓ సర్క్యులర్ జారీ చేసి తన బాధ్యత తీరిపోయిందని భావించింది. న్యాయస్థానాలేగనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించలేము. హైకోర్టు కలుగజేసుకుని కేసును సీబీఐకి అప్పగించింది. కానీ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం పోలీసులపైన, రాష్ట్రప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో మండిపడింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ను వేరే పదవిలో నియమించడమేంటంటూ ప్రశ్నించిన న్యాయస్థానం ఆయనను దీర్ఘకాల సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
అలాగే విధి నిర్వహణలో ఉన్న వైద్యుల భద్రతకోసం తీసుకోవలసిన చర్యలను సూచించడానికి పలువురు నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. కేసును తాము చేపట్టినందున ఆందోళన విరమించి విధుల్లో చేరాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సలహా ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ప్రయత్నిస్తుండడం బాధాకరం.
అత్యాచారాలకు పాల్పడే నిందితులకు మరణశిక్ష విధించేలా వారంలో చట్టంలో మార్పులు చేస్తామని మఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. మమత సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రాజకీయ రచ్చ ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు.