ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి వినతిపత్రం అందజేత..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కృష్ణ సాగర్ పంచాయతీ పరిధిలోని చింతా లక్ష్మినగర్ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మంగళవారం ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) భద్రాచలం డివిజన్ కార్యవర్గం ఆధ్వర్యంలో గ్రామస్తులు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ భద్రాచలం డివిజన్ ప్రధాన కార్యదర్శి సున్నం భూలక్ష్మి మాట్లాడారు. పినపాక, బూర్గంపాడు ప్రాంతాలకు చెందిన ఆది వాసీలు, దళిత మహిళలు సొంత ఇల్లు లేని నిరుపేదలు ఇరవై నెలల క్రితం కృష్ణ సాగర్ పంచాయతీ పరిధిలోని ఇండ్లు నిర్మించుకున్నారని త్రాగునీరు విద్యుత్ లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విషయమై గత ఆరు నెలల క్రితం ఎమ్మెల్యేను కలిసామని తమ ఇబ్బందులు చెప్పుకున్నా ప్రభుత్వం స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అడవిలో జంతువుల కొరకు త్రాగునీటి బోర్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఆదివాసి బిడ్డలమైన తమను ఎందుకు గుర్తించడం లేదని తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో అని ఆమె వాపోయారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చింత లక్ష్మీనగర్ గ్రామానికి త్రాగునీరు విద్యుత్ సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినందుకు గ్రామస్తుల తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు భద్రాచలం డివిజన్ మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి సున్నం భూలక్ష్మి, అధ్యక్షురాలు కోడిమ రాధమ్మ, రాపర్తి లక్ష్మి, కోసం రమణమ్మ, పరిషక రమణమ్మ, వైనాల నాగలక్ష్మి, కిరణ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.