ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు
ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు
‘డెన్సో’ రాకతో వాహనాల పరిశ్రమకు ఊతం
కంపెనీల సంసిద్ధతపై మంత్రి హర్షం
హైదరాబాద్, నవంబర్ 6 (విజయ క్రాంతి): హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డా.రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ ప్రతి పాదనలను పంచుకున్నారు.
ఈ కంపెనీలు ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఫార్మానగరం కూడా భాగంగా ఉంటుందన్నారు. ఈ ఐదు కంపెనీల్లో ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగుల పనిచేస్తున్నారని, తొలిదశలో ఒక్కో కంపెనీ 50 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. గ్రీన్ ఫార్మాసిటీకి మంచినీరు, విద్యుత్ సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు చెప్పారు.
కొంగర కలాన్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని వివరించారు. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డు టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రోడ్డుకు సమాంతరంగా మెట్రో రైలు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మిటరీలు నిర్మిస్తామని వెల్లడించారు.
ప్రతి పరిశ్రమ ప్రత్యేకంగా బాయిలర్లు ఏర్పాటు చేయనవసరం లేకుండా పైపుల ద్వారా వేడి నీటి ఆవిరి అందించే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. టీజీఐఐసీ నీటిని నేరుగా సరఫరా చేస్తుందని వివరించారు. త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ పాల్గొన్నారు.
‘డెన్సో’తో ఊతం
రాష్ట్రంలోని ఆటోమోటివ్ డిజైన్, చిప్‌ల తయారీ, సెన్సార్ ఇంజినీరింగ్ సంస్థలు ఆటోమోటివ్ రంగ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. బుధవారం జపాన్‌కు చెందిన వాహనాల విడిభాగాల తయారీ సంస్థ డెన్సో స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. ఆటోమోటివ్ రంగంలో దేశం ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు.
డెన్సో లాంటి అగ్రగామి సంస్థల రాకతో రాష్ట్రం వాహనాల తయారీ రంగంలో సుస్థిర ఆవిష్కరణలతో మరింత ముందుకు దూసుకుపోతోందని వెల్లడించారు. ఎంవోయూ కార్యక్రమంలో డెన్సో భారత ప్రాంతీయ సీఈఓ యశుహీరో లిడా, డైరెక్టర్ ఎయిజీ సోబుబే, వైస్ ప్రెసిడెంట్ తొమొనొరి ఇనుయె, నవీన్ వర్మ, టీ సీఈవో సుజిత్ జాగిర్దార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఐటీ, వాణిజ్య విభాగం ముఖ్య వ్యూహకర్త శ్రీకాంత లంకా తదితరులు పాల్గొన్నారు.