27-02-2025 11:15:09 PM
పీఎంవో కార్యాలయంలో ఉద్యోగుల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. బలవంతంగా ఉద్యోగులను లేఆఫ్ చేయడంపై పీఎంవోకు ఫిర్యాదు అందడం ఆసక్తి కలిగించింది. ఉద్యోగుల తొలగింపు పీఎంవో కార్యాలయానికి వందకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని ట్రైనీలు ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర కార్మిక శాఖ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఆరంభంలో మైసూరు క్యాంపస్‌లోని దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
గూగుల్‌లోనూ కోతలు
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కూడా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. క్లౌడ్ డివిజన్‌లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. ఎంతమందిని తొలగించారన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. దాదాపు వంద మంది ఉద్యోగులపై వేటు పడినట్లు మాత్రం తెలుస్తోంది. ఇటీవలే ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో గూగుల్ తన క్లౌడ్ వ్యాపారంలో ఆదాయ అంచనాలు అందుకోకపోవడంతో ఉద్యోగులు తొలగింపు చేపట్టింది.