13-02-2025 01:28:40 AM
నెలాఖరులో లెటర్స్!
బెంగళూరు: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఈ నెల ముగిసేలోగా ఉద్యోగులకు వేతన పెంపునకు సంబంధించిన లేఖలు జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయని ‘మనీకంట్రోల్’ తెలిపింది.
ఈ వేతన పెంపు 5-8 శాతం మధ్య ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇటేవల వెల్లడించిన మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగానూ 6 -8 శాతం వార్షిక వేతన పెంపు ఉండొచ్చని కంపెనీ సీఎఫ్‌ఓ జయేశ్ సంఘ్రాజ్కా వెల్లడించారు.
ఇన్ఫోసిస్ బ్యాచ్‌ల వారీగా ప్రమోషన్ లెటర్లు జారీ చేయడం ప్రారంభించింది. డిసెంబర్‌లో మొదటి బ్యాచ్ ఉద్యోగులకు ఈ లేఖలు అందాయి. ఫిబ్రవరి నెలాఖరులో మరికొందరికి ప్రమోషన్లు అందించనుంది. గతంలో లెటర్లు అందుకున్న వారికి జనవరి నుంచి వేతన పెంపు అమల్లోకి వచ్చింది.
ఫిబ్రవరి నెల బ్యాచ్‌కు ఏప్రిల్ నుంచి వేతన పెంపు వర్తించనుంది.రానున్న రోజుల్లో ఐటీకి డిమాండ్ పుంజుకోవచ్చన్న అంచనాల వేళ ఇన్ఫీ ఈ వేతన పెంపు చేపడుతుండడం గమనార్హం. అత్యధికంగా అమెరికా నుంచి ఆదాయాలు అందుకొనే ఐటీ కంపెనీలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీకి బడ్జెట్ పెరగొచ్చని భావిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో కొన్ని ఐటీ కంపెనీలు వేతన పెంపును వాయిదా సందర్భాలూ ఉన్నాయి.