13న చిలుకు ద్వాదశి :
కార్తీకమాసంలో ప్రధానమైన పర్వదినాలలో ఒకటి ‘చిలుకు ద్వాదశి’ లేదా ‘క్షీరాబ్ది ద్వాదశి’. ఇదే రోజు చాతుర్మాస్య వ్రతదీక్షలు సమాప్తమవుతాయి. కనుక, దీనినే ‘యోగీశ్వర ద్వాదశి’, ‘హరిబోధిని ద్వాదశి’ అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయనైకాదశి) నాడు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. నాలుగు నెలలు యోగనిద్రలో గడిపిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజు (12వ తేది) మేల్కొంటాడు. ఇలా వచ్చే ఏకాదశి, ద్వాదశి రెండూ రోజులూ గొప్ప పర్వదినాలే.
అలా మేల్కొన్న శ్రీమహావిష్ణువు అనంతరం భూమిపైకి దృష్టి సారిస్తాడు. ఇంతటి పవిత్రమైన రోజు కనుకే, ఈ ఏకాదశిని ‘బోధనైకాదశి’గానూ పిలుస్తారు. మర్నాడే ద్వాదశి. ఇదే ‘చిలుకు ద్వాదశి’. ఈ కారణంగానే దీనిని ఎంతో పరమ పుణ్యదినంగా హైందవులు విశ్వసిస్తారు. ఈ రోజున తులసి, ఉసిరి మొక్కలను పూజించడం ఆనవాయితీ. వాటి రూపంలో జరిగే పూజా కార్యక్రమం సాక్షాత్తు లక్ష్మీదేవి ఆరాధనతో సమానమే.
మరో విశిష్టత ఏమిటంటే, ఎల్లవేళలా శేషశయ్యపై శయనించే శ్రీమహావిష్ణువు ఈ రోజున దేవతలందరితో కలసి బృందావనానికి వెళ్తాడు. కాబట్టే, ఇవాళ్టి రోజు ఎవరైతే శ్రద్ధగా ఆయనని పూజిస్తారో వారికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆనాటి పుణ్యస్నానం సర్వ పుణ్యతీర్థాల మహాఫలాన్ని ఇస్తుందని ప్రతీతి. యజ్ఞయాగాదులు చేసినంతటి ఫలితమూ లభిస్తుంది.
‘ఉత్థాన ఏకాదశి’ నాడు ఉపవాసం వుండి, జాగరణ చేయాలి. మర్నాటి ద్వాదశి నాడు వ్రతం ఆచరించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి, అన్నదానం చేయాలి. దీనివల్ల ‘అనంత పుణ్యఫలం’ లభిస్తుందని వేద పండితులు అంటారు. ఈనాటి అన్నదానం ఫలం మామూలుది కాదు, సూర్య గ్రహణం రోజున గంగానదీ తీరంలో కోటిమందికి అన్నదానం చేయడంతో ఇది సమానమని వారంటారు.
కూర్మావతారం
క్షీర సాగరాన్ని మధించేందుకు దేవదానవులు సిద్ధమవుతారు. కవ్వంగా భూమధ్య స్థానంలో వున్న మందర పర్వతాన్ని తీసుకుంటారు. దానికి తాడుగా వాసుకీ సర్పాన్ని ఆధారంగా చేసుకొని పాల కడలిని చిలికేందుకు ఉపక్రమిస్తారు. కానీ, మందర పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది సరైన ఆధారం లేక పట్టుతప్పి పడిపోయింది.
అప్పుడు దాన్ని పైకి లేపి, సాగరాన్ని మధించేందుకు వీలుగా విష్ణుమూర్తి ‘కూర్మావతారం’ (తాబేలు రూపం) దాల్చాడు. అనంతరం క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని పరమశివుడు కంఠంలో ధరించి, సమస్త విశ్వాన్ని కాపాడతాడు. పిమ్మట పాలకడలి నుంచి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం వంటివి ఉద్భవించాయి. అనంతరం లక్ష్మీదేవి!
శ్రీమహాలక్ష్మీ- మహావిష్ణువుల పెళ్లిరోజు
అలా అవతరించిన శ్రీమహాలక్ష్మిని మహావిష్ణువు వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు ‘క్షీరాబ్ది ద్వాదశి’. అందుకే, ఆనాడు శ్రీమహాలక్ష్మిని కూడా పూజిస్తారు. తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్కనూ వుంచి పూజించడం వల్ల ‘అనంత పుణ్య ఫలం’ కలుగుతుందని ప్రతీతి.
ఇక, కార్తీకమాసంలో రోజు దీపాలు వెలిగించాలి. రోజూ సాధ్యం కానివారు కనీసం ఈనాటి (శుద్ధ) ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి (మూడు) రోజులలో దీపారాధన చేయాలి. ఫలితంగా ‘వైకుంటప్రాప్తి’ తథ్యమని పెద్దలు చెప్తారు.
‘ప్రార్థన’ డెస్క్