సర్వసిద్ధి ప్రదాత :
ఆది మధ్యాంత హీనాయ
అనంతాయ నమో నమః
అనంతుడంటే ఆది మధ్యాంత రహితుడైన ‘నిరాకార నిర్గుణ పరబ్రహ్మమని’ అర్థం. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసంలో వుండగా, అనేక దుఃఖాలను పొందుతూ ఉంటారు. తమ హితైషి అయిన శ్రీకృష్ణ పరమాత్మను దుఃఖ నివారణ ఉపాయం ఉపదేశించమని ప్రార్థించినప్పుడు అనంతుని ఆరాధనను సూచిస్తాడు. “ధర్మరాజా! అనంత వ్రతమనే ఒక వ్రతముంది. అది మానవులందరికీ, విశేషించి స్త్రీలకు సమస్త పాపపరిహారంతోపాటు సర్వసిద్ధులను కలిగిస్తుంది. అంటే, ఇహ జన్మలో మనం అనుభవించే దుఃఖాలన్నిటికీ పురాకృత పాప విశేషమే కారణం. ఆ పాపఫలం మనలను ఆవరించి వున్నంత కాలం ఏ కార్యసిద్ధీ కలగదు” అంటాడు శ్రీకృష్ణుడు. అనంత వ్రతాన్ని ఆచరించే విధానాన్ని కూడా వివరించాడు.
భాద్రపద శుక్ల చతుర్దశి రోజున ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించే సమస్త దుఃఖాలు, రోగాలు, కష్టాలు, బాధలు అన్నీ ఈ పాంచ భౌతికమైన శరీరానికే కానీ, పరమాత్మ స్వరూపమైన ఆత్మకు అంటవు. పురాకృత కర్మ విశేషం వల్ల మనం ఈ శరీరంతో వున్నపుడే ఇవన్నీ అనుభవించి తీరవలసిందే. తెలిసో, తెలియకో చేసిన పాపఫలాన్ని అనుభవించడం ఎలాగూ తప్పదు కనుక తీవ్రత, పీడ పరిహారాదుల కోసం ‘దైవీశక్తి’ని ఆశ్రయించక తప్పదు. అదొక్కటి మాత్రమే వీటి బారినుండి మనలను కాపాడుతుంది.
అందుకే, భగవంతునికి చేసే ఆరాధన, అర్చన, కల్యాణం మొదలైన ప్రక్రియలన్నీ ఉపచారాలుగా గాని, సపర్యలుగా గాని లోకకల్యాణం కోసం అంటే మన కోసం (లోకంలో మనమూ ఒక భాగం కనుక) మాత్రమే చేస్తున్నాం. కానీ, వీటివల్ల భగవంతునికి ఒరిగేదేమీ లేదు. పాపరాశి పటాపంచలైనప్పుడే సుఖభోగాల అనుభూతి కలుగుతుంది. సుఖసంతోషాలను, సౌభాగ్య సంపదలను పాపమనే అంధకారం ఆవరించి వున్నంత వరకు, వాటి అనుభూతి జీవునకు కలుగదు.
దీనికి మరో ఉదాహరణ. ఒక బాటసారి తెరువూ, తెన్నూ కానక రాత్రంతా అడవిలో తిరిగినా, త్రోవ కనిపించదు. పాపమనే అజ్ఞానాంధకారం తొలిగిన తర్వాత త్రోవలు కనిపిస్తాయి. నిజానికి ఆ రాత్రంతా త్రోవలు అలాగే అక్కడే ఉన్నాయి. దేన్ని అనుసరించాలన్న జ్ఞానం అతనిలో లుప్తమైంది. దీనికి అజ్ఞానమనే అంధకారమే అసలు కారణం. మనం ఏ జన్మలోనో చేసిన పాపపుణ్య ఫలాల్ని వచ్చేజన్మలో పొందుతామని అనుకుంటాం. ఇందులో కొంత సత్యం ఉన్నా అంతా సత్యం మాత్రం కాదు.
ఎందుకంటే, మనం చేసిన పాప విశేషం గాని, పుణ్య విశేషం గాని, కుండ నిండి పొంగి పొర్లినట్లయితే, దాని ఫలాన్ని మూడేళ్లలోనో, మూడు నెలల్లోనో, మూడు పక్షాల్లోనో, ఇంకా చెప్పాలంటే మూడు రోజుల్లోనో ఇహ లోకంలోనే (ఇక్కడే) అనుభవిస్తాం. ఆ పుణ్యవిశేషం అత్యధికంగా కలగాలనే ఈ వ్రతాలు, పూజలు, నోములు, సాధనలు పేర్కొనబడ్డాయి. ‘అనంత వ్రతం’ రోజున చేయవలసిన ఒక సాధనా విశేషం కూడ వుంది. దానిని ‘అనంత ఐశ్వర్యలక్ష్మీ సాధన’ అనీ అంటారు.
- డా.పైడిమర్రి మాణిక్యప్రభు శర్మ