calender_icon.png 15 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచనాల్ని మించిన ఇన్ఫీ

19-07-2024 12:05:00 AM

  • నికరలాభం రూ.6,368 కోట్లు 
  • ఆదాయం రూ.39,315 కోట్లు

బెంగళూరు, జూలై 18: టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్‌ల బాటలోనే దేశంలో రెండవ పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సైతం అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను పెంచింది. ఇన్ఫీ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 ఏప్రిల్ తొలి త్రైమాసికంలో 7 శాతం వృద్ధిచెంది రూ. 6,368 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.5,945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే గత మార్చి త్రైమాసికంలో సంపాదించిన రూ.7,969 కోట్ల లాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 20 శాతం తగ్గింది.

కానీ  జూన్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ లాభం రూ.6,280 కోట్ల వరకూ ఉండవచ్చన్న పలు బ్రోకరేజ్‌లు, విశ్లేషకులు అంచనాల్ని అధిగమించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ ఆదాయం 3.6 శాతం వృద్ధితో రూ.3,7933 కోట్ల నుంచి రూ.39,315 కోట్లకు పెరిగింది. స్వీక్వెన్షియల్‌గా సైతం రెవిన్యూను 3.7 శాతం వృద్ధిపర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను 3 శాతానికి పెంచింది. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన గైడెన్స్ 1 శాతం.

2025 ఆర్థిక సంవత్సరాన్ని విస్త్రత వృద్ధితో అద్భుతంగా ప్రారంభించామని, పెద్ద డీల్స్‌ను సంపాదించామని, అత్యధిక స్థాయి లో నగదును తీసుకొచ్చామని  ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ చెప్పారు. తాము అందిస్తున్న సర్వీసులు, తమ పట్ల క్లయింట్లు ఉంచిన విశ్వాసానికి ఈ వృద్ధి నిదర్శనమని అన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫీ వెల్లడించిన ఫలితాలకు స్పందనగా గురువారం రాత్రి అమెరికా నాస్‌డాక్‌లో ఈ షేరు 10 శాతం పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి 22.80 డాలర్ల వద్దకు చేరింది. 

20,000 వరకూ ఫ్రెషర్స్ నియామకాలు

ఈ ఏడాది తమ వృద్ధి రేటు ఆధారంగా 15,000 నుంచి 20,000 వరకూ ఫ్రెషర్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే క్యూ1లో కంపెనీ రోల్స్ నుంచి 1,908 మంది ఉద్యోగులు తగ్గారు. 2023 జూన్ నుంచి ఏడాదికాలంగా 20,962 ఉద్యోగులు నికరంగా తగ్గారు. ఈ జూన్ చివరినాటికి కంపెనీ రోల్స్‌లో మొత్తం 3,15,332 మంది ఉద్యోగులు ఉన్నారు. 

4.1 బిలియన్ డాలర్ల డీల్స్

సమీక్షా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 4.1 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద డీల్స్‌ను సంపాదించింది. జూన్ క్వార్టర్లో 21.1 శాతం ఆపరేటింగ్ మార్జిన్‌ను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 20 శాతం మేర ఉంటుందని అంచనా వేసింది.

రిజర్వేషన్లపై ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తాం..

రిజర్వేషన్లపై కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టే నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తామని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో మేనేజ్‌మెంట్ క్యాటగిరీలో 50 శాతం, నాన్‌న క్యాటగిరీల్లో 70 శాతం స్థానికులను నియమించాలంటూ కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.  ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ బిల్లుపై పరేఖ్ స్పందిస్తూ ‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నియమ నిబంధలకు అనుగుణంగా పనిచేయాలనుకుంటున్నాం.

రాష్ట్రం ప్రవేశ పెట్టే ఎటువంటి కొత్త నిబంధనలు, మార్గదర్శకాలకైనా మద్దతు ఇస్తాం’ అని చెప్పా రు.  ఈ బిల్లును ఐటీ పరిశ్రమ సమాఖ్య నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తాజా వ్యాఖ్యలు గమనార్హం. ఇన్ఫీ మాజీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ మోహన్‌దాస్ పాయ్ సైతం ఈ బిల్లును తప్పుపట్టారు.

 ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్