calender_icon.png 29 December, 2024 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తస్రావంతో బాలింత మృతి

29-12-2024 01:56:16 AM

* వైద్యుల నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబీకుల ఆందోళన 

* నల్లగొండ ప్రభుత్వ  దవాఖానలో ఘటన 

నల్లగొండ, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మగబిడ్డకు జన్మనిచ్చిన 24 గంటల్లోనే రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన(ఎంసీహెచ్)లో చోటుచేసుకున్నది. వివరాలిలా.. దామరచర్ల మం డలం జైలోతు తండాకు చెందిన గర్భిణి రాజేశ్వరి(19) ప్రసవం కోసం శుక్రవారం దేవరకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు హైరిస్క్ కేసుగా భావించి నల్లగొండ జనరల్ దవాఖానకు రెఫర్ చేశారు. దీంతో అదేరోజు రాత్రి కుటుంబసభ్యులతో కలిసి వచ్చింది.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు  అర్ధరాత్రి తరువాత సిజేరియన్ చేయగా రాజేశ్వరి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శనివారం సాయం త్రం బీపీ పెరిగి రాజేశ్వరి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంతదూరం వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేదని.. ఇక్కడే చికిత్స చేయాలని బాలింత కుటుంబీకులు కోరడంతో వైద్యులు చికిత్స చేస్తుండగా బాలింత ప్రాణాలు కోల్పోయింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజేశ్వరి మృతి చెందిందని ఆమె బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని చట్టం ప్రకారం వెళ్లాలని మృతురాలి కుటుంబీకులు, బంధువులకు సర్ది చెప్పారు.  ఈ విషయమై ప్రసవ విభాగం హెచ్‌వోడీ స్వరూపరాణిని వివరణ కోరగా.. ‘గర్భిణి వయస్సు తక్కువగా ఉంది. గర్భంలో రక్త ప్రసరణ సరిగ్గా లేక శిశువు ఎదుగుదల సక్రమంగా లేదు.

సిజేరియన్ చేయకముందే ఈ విషయంతోపాటు బీపీ ఎక్కువగా ఉందని కూడా ఆమె కుటుంబసభ్యులకు చెప్పాం. ఆ తర్వాత వారి అనుమతితోనే సిజేరియన్ చేయగా.. బీపీ ఎక్కువగా ఉండడంతో రక్తం గడ్డకట్టలేదు. దీనికి తోడు ప్లేట్ లెట్స్ పడిపోగా.. తిరిగి అందించినా ఫలితం కనిపిం చలేదు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదు’ అని ఆమె తెలిపారు.