calender_icon.png 25 September, 2024 | 11:53 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

09-09-2024 01:25:17 AM

వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): వేములవాడ ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. వేములవాడకు చెందిన గర్భిణి పిల్లి రజిత(22)కు పురిటి నొప్పులు రావడంతో గురువారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు సిజేరియన్ చేయగా మగ శిశువు జన్మించింది. శుక్రవారం ఉదయం రక్తస్రావం అవుతుండటంతో కుటుంబీకులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా వారరి సూచనతో కరీంనగర్ తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బెడ్ దొరకకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ సమయంలో రక్తం గడ్డకట్టుకు పోయిందని చెప్పి మళ్లీ శస్త్ర చికిత్స నిరహించారు. కానీ అప్పటికే రజిత ఆరోగ్యం విషమంగా మారడంతో శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆదివారం మృతురాలి బంధువులు వేములవాడ ఏరియా ఆసుపత్రికి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే రజిత చనిపోయిందని ఆరోపిస్తూ న్యాయం కావాలని కోరారు. పట్టణ సీఐ వీరప్రసాద్ చేరుకొని బందోబస్తు నిరహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య మాట్లాడుతూ.. తమ పొరపాటు లేదని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ వెళ్లాలని చెప్పామని పేర్కొన్నారు.