- ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ విఫలం
- టీమిండియాకు వరుస పరాజయాలు
- బంగ్లాతో సిరీస్ మినహా అన్నింటా ఓటములే
- చాంపియన్స్ ట్రోఫీ రూపంలో అగ్నిపరీక్ష
విజయక్రాంతి ఖేల్ విభాగం: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడు నెలలు పూర్తయింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గతేడాది జూలై 9న గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కోచ్ పదవి చేపట్టినప్పుడు ఈ ఏడు నెలల్లో బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే సిరీస్ మినహా మిగతా అన్నింటిలోనూ ఓటములే ఎక్కువగా పలకరించాయి
. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంప్రదాయ టెస్టుల్లో మాత్రం భారత ఆటతీరు తీసికట్టుగా తయారైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 0 కోల్పోవడం, 27 ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కోల్పోవడం.. గత రెండు పర్యటనల్లో ఆసీస్‌ను మట్టికరి పించి బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను గెలిచిన టీమిండియా ఈసారి కంగారూల చేతిలో కీలుబొమ్మలా మారి 1-3తో సిరీస్‌ను సమర్పించుకుంది.
కోచ్‌గా ఎత్తు పల్లాలు సహజం. జట్టును గాడిన పడేసేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఏడు నెలుల కావొస్తున్నా జట్టు ఆటతీరులో ఏ మార్పు రాకపోవడం.. అతను కోచ్‌గా వచ్చాకా టీమిండియా ప్రదర్శన మరింత దిగజారిపోవడం కోచ్‌గా గంభీర్ ఫెయిల్యూర్‌ను చూపిస్తోంది. ‘అత్యుత్తమ భారత జట్టును తీర్చిదిద్దుతాను..
టెస్టుల్లో 400 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించేలా తయారు చేస్తా’ అని కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో గంభీర్ పలికిన మాటలివి. దానిని ఆచరణలో పెట్టడం మాటలు చెప్పినంత సులువు కాదని గంభీర్‌కు ఈ పాటికే అర్థమయి ఉండాలి. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ గంభీర్‌కు అగ్నిపరీక్ష కానుంది.
కొట్టొచ్చిన అనుభవలేమి..
గంభీర్ ఇంతకముందు పూర్తి స్థాయి కోచ్‌గా పనిచేసిన దాఖలాలు లేవు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లకు మెంటార్ కమ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌తో పోలిస్తే జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేయడం సవాల్ లాంటిది. సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
ఈ విషయంలో గంభీర్ సక్సెస్ అయినప్పటికీ జట్టును మెరుగ్గా రూపొందించడంలో విఫలమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లలో ప్రణాళికలు రూపొందించడం, ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వ్యక్తులను అభిషేక్ నాయర్ (బ్యాటింగ్), టెన్ డస్కటే( ఫీల్డింగ్), మోర్నీ మోర్కెల్ (బౌలింగ్) కోచ్‌లుగా తీసుకున్నాడు.
బీసీసీఐ పెద్దల అండతో ప్రధాన కోచ్‌గా వచ్చిన గంభీర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నాడు. ఈ మూడేళ్లలో భారత్ ఐసీసీ టోర్నీలతో పాటు సేనా దేశాల్లో సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికిప్పుడు గంభీర్ పదవికి ముప్పు లేనప్పటికీ ఇకపై కూడా టీమిండియా వరుస ఓటములు చూస్తే మాత్రం తనంతట తానుగా తప్పుకోవాల్సిందే.