calender_icon.png 14 January, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 నెలల గరిష్ఠానికి పారిశ్రామికం

11-01-2025 12:00:00 AM

నవంబర్‌లో 5.2 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 10: భారత్ పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు నవంబర్‌లో ఆరు నెలల గరిష్ఠస్థాయిలో నమోదయ్యింది. పండుగ సీజన్ డిమాంత్‌తో తయారీ రంగం పుంజుకోవడం ఇందుకు కారణం. నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) ఆరు నెలల గరిష్ఠస్థాయి 5.2 శాతం వృద్జిచెందిందని శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

2024 మే నెలలో నమోదైన 6.3 శాతం వృద్ధి రేటు తర్వాత గరిష్ఠస్థాయిలో నమోదైన రేటు ఇదే. గత ఏడాది జూన్ నెలలో 4.9 శాతం, జూలైలో 5 శాతం వృద్ధిచెందిన ఐఐపీ ఆగస్టు నెలలో ఫ్లాట్‌గా నిలిచింది.

సెప్టెంబర్‌లో 3.1 శాతం, అక్టోబర్‌లో 3.7 శాతం చొప్పున వృద్ధిచెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో పారిశ్రామికోత్పత్తి 4.1 శాతం వృద్ధిచెందగా, గత ఏడాది ఇదేకాలంలో ఈ వృద్ధి 6.5 శాతంగా ఉన్నది. 

పెరిగిన తయారీ..తగ్గిన మైనింగ్

2024 నవంబర్ నెలలో మైనింగ్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఏడాది ఇదేనెలతో పోలిస్తే 7 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-నవంబర్‌లో కూడా మైనింగ్ వృద్ధి 6.5 శాతం నుంచి 4.1 శాతానికి క్షీణించింది. తయారీ రంగం వృద్ధి రేటు నవంబర్‌లో ఏడాది క్రితంతో పోలిస్తే 1.3 శాతం నుంచి 5.8 శాతానికి చేరింది.

విద్యుదుత్పత్తి వృద్ధి 5.8 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. తయారీ విభాగమైన క్యాపిటల్ గూడ్స్ వృద్ధి 2023 రేటు నవంబర్‌లో 1.1 శాతం క్షీణించగా, 2024 నవంబర్‌లో 9 శాతం పెరిగింది.

పండుగ డిమాండ్‌ను సూచించే కన్జూమర్ డ్యూరబుల్స్ (వైట్ గూడ్స్) ఉత్పత్తి ముగిసిన నవంబర్‌లో భారీగా 13.1 శాతం పెరిగింది. 2023 నవంబర్‌లో 4.8 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి వృద్ధి దాదాపు ఫ్లాట్‌గా 0.6 శాతంగా నమోదయ్యింది. 2023 నవంబర్‌లో ఈ విభాగం ఉత్పత్తి 3.4 శాతం పడిపోయింది. 

ఇన్‌ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల జోరు

తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇన్‌ఫ్రా/కన్‌స్ట్రక్షన్ ఉత్పత్తుల తయారీ 2024 నవంబర్‌లో 10 శాతం పెరిగింది. ఏడాది క్రితం వీటి ఉత్పత్తిలో వృద్ధి 1.5 శాతమే. ప్రైమరీ ఉత్పత్తుల ఉత్పత్తి వృద్ధి రేటు మాత్రం 8.4 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గింది. ఇంటర్మీడియట్ గూడ్స్ విభాగం ఉత్పత్తి 3.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.