- రైతుల నుంచి సొమ్ము వసూలుపై విచారణకు ఆదేశం
- క్షేత్రస్థాయిలోకి గజ్వేల్ డీఈ, తుక్కాపూర్ ఏడీ
- ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి)/ గజ్వేల్: ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ కనెక్షన్ సమస్యతో సతమతమవుతున్న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన రైతు లు పడుతున్న వెతలపై సోమవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘కర్రలు, చెట్లే కరెంట్ పోళ్లు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి విద్యుత్‌శాఖలో కదలిక వచ్చింది.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రైతుల నుంచి సొమ్ము వసూలు చేసిన లైన్‌మన్ మహిపాల్‌రెడ్డిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గజ్వేల్ డీఈ భానుప్రకాశ్ సస్పెండ్ చేశారు. మరోవైపు డీఈతో పాటు తుక్కాపూర్ ఏడీ శ్రీనివాసరావు, దౌల్తాబాద్ ఇంచార్జి ఏఈ శ్రీనివాస్‌రావు విద్యుత్ సిబ్బందితో కలిసి ఇందుప్రియా ల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులతో స్వయంగా మాట్లాడి.. వారు ఎదుర్కొంటున్న విద్యు త్ సమస్యలు తెలుసుకున్నారు. తుప్పతి మల్లయ్య, తుప్పతి బీరయ్య, తుప్పతి సింగయ్య, కడారి రాజమల్లు తదితరులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 15 నెలలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యల ను ఏకరువు పెట్టారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్‌కు సొమ్ము చెల్లించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, తామంతా హైదరాబాద్‌లోని ‘విజయక్రాంతి’ దినపత్రిక కార్యాలయానికి వెళ్లామని, ఆ పత్రిక కథనం రాస్తే తప్ప విద్యుత్‌శాఖ నుం చి స్పందన రాలేదని వెల్లడించారు.
రాష్ట ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షే మం కోసం రైతు భరోసా, రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్‌తోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను అందజేస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో అధికారు లు మాత్రం తమకేమీ సంబంధం అన్నట్టు వ్యవహరిస్తుండటంతో విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.
రైతులు సొమ్ము ఇవ్వనక్కర్లేదు: డీఈ
రైతుల సమస్యలు విన్న డీఈ భానుప్రకాశ్ వెంటనే స్పందించారు. ట్రాన్స్‌ఫా ర్మర్ ఏర్పాటుకు లైన్‌మన్ సొమ్ము వసూలు చేసిన అంశంపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు. అలాగే అనువైన స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పా టు చేయాలని, అందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలు బిగించి, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఏడీ శ్రీనివాసరావును ఆదేశించారు.
ఇకపై ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయ ని హెచ్చరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు కోసం రైతులు విద్యుత్ సిబ్బందికి సొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదని, వారు నేరుగా డిపార్ట్‌మెంట్ పేరుపై డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది ఎవరైనా డబ్బు లు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.