అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం..
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఆయన తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తితో కలిసి లొకేషన్ చూశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొందరగా స్థల సేకరణ పూర్తి చేసి ఇండస్ట్రీస్ డిపార్టుమెంటుకు అప్పగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.