ఫేవరెట్‌గా సాత్విక్ జోడీ
సింగిల్స్ బరిలో సింధూ, లక్ష్యసేన్, ప్రియాన్షు
జకర్తా (ఇండోనేషియా): ఇండియా ఓపెన్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే మరో బ్యాడ్మింటన్ టోర్నీకి తెరలేచింది. నేటి నుంచి జకర్తా వేదికగా ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ప్రారంభం కానుంది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌లో ఓటమి పాలైన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ జోడీ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. తొలి రౌండ్‌లో ఈ జంట చైనీస్ తైపీకి చెందిన చెన్ జి యు చెహ్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధూ కూడా టోర్నీలో ఆడనుంది. పెళ్లి తర్వాత బరిలోకి దిగిన ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరి మంచి ఆటతీరును ప్రదర్శించిన సింధూ ఇండోనేషియా మాస్టర్స్‌లో విజేతగా నిలవాలని భావిస్తోంది. సింధూ తొలి రౌండ్‌లో సుంగ్ యున్ (చైనీస్ తైఫీ)తో తలపడనుంది. మరో సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ టాప్ సీడ్ నవోమి ఒకుహరాను ఎదుర్కోనుండగా.. అనుపమ ఉపాధ్యాయ స్థానిక ప్లేయర్ జార్జియా మరిస్కాతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ లక్ష్యసేన్ బరిలో ఉన్నప్పటికీ అతని ఫామ్ కలవరపెడుతోంది. వరుసగా రెండు టోర్నీల్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రియాన్షు రజావత్‌తో పాటు తెలంగాణ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి కూడా బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప కాస్ట్రో బరిలో ఉండగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని ధ్రువ్ కపిలతో జత కట్టనుంది. ఇక రోహన్ కపూర్ గడ్డే మరో జంటగా బరిలోకి దిగనుంది.